IPL: ఉప్పల్ స్టేడియం వద్ద నంబర్ ప్లేట్ లేని బైక్ లపై తిరుగుతూ బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్న కేటుగాళ్లు
- స్టేడియం వద్దే జోరుగా బ్లాక్ లో టికెట్ల అమ్మకం!
- రూ.1000 విలువైన టికెట్ బ్లాక్ లో రూ.5 వేలు!
- మ్యాచ్ కోసం భారీ బందోబస్తు ఏర్పాటు
ఐపీఎల్-12 సీజన్ చరమాంకానికి చేరుకుంది. ఇవాళ హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ అంతిమ సమరం వీక్షించడానికి అందుబాటులో ఉంచిన టికెట్లు బ్లాక్ లో విక్రయిస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పట్టపగలే ఉప్పల్ స్టేడియం వద్ద నంబర్ ప్లేట్ లేని బైక్ లపై తిరుగుతూ కొందరు కేటుగాళ్లు బ్లాక్ లో టికెట్లు అమ్ముతుండడం తీవ్ర కలకలం రేపింది.
రూ.1000 విలువైన టికెట్ ను రూ.5 వేలకు, రూ.2000 విలువైన టికెట్ ను రూ.10 వేలకు విక్రయిస్తున్నట్టు సమాచారం. ఫైనల్ మ్యాచ్ ను పురస్కరించుకుని స్టేడియం పరిసరాల్లో 2,800 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు, స్టేడియం చుట్టుపక్కల 300 సీసీ కెమెరాలు కూడా ఉన్నా బ్లాక్ లో టికెట్ల అమ్మకాలు జోరుగా సాగుతుండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.