Jana Sena: ఇది ఓట్లు, సీట్లు లెక్కలు వేసుకునే సమీక్షా సమావేశం కాదు: నాదెండ్ల మనోహర్
- మార్పు కోసం పవన్ ప్రయత్నం అభినందనీయం
- పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై సమీక్ష
- బరిలోకి దిగిన వారి అనుభవాలు తెలుసుకునేందుకు ఈ సమీక్ష
గుంటూరు జిల్లా మంగళగిరిలోని ‘జనసేన’ కార్యాలయంలో పార్టీ తరఫున పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో పాల్గొన్న జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా, ఆరోగ్యం సహకరించకున్నా బలమైన మార్పు తేవాలన్న ఏకైక కాంక్షతో, పట్టుదలతో పవన్‌కల్యాణ్ చేసిన ప్రయత్నాన్ని అంతా మెచ్చుకోవాలని అన్నారు. ఇది ఓట్లు, సీట్లు లెక్కలు వేసుకునే సమీక్షా సమావేశం కాదని, అభ్యర్థులు ఒకరినొకరు పరిచయం చేసుకోవడంతో పాటు ఓ కొత్త తరం రాజకీయ వేదిక నుంచి బరిలోకి దిగిన వారి అనుభవాలు తెలుసుకోవడమే ఈ ముఖాముఖి ఉద్దేశమని చెప్పారు. రాబోయే కాలంలో పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి, స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా ఎదుర్కోవాలి, సమస్యల నుండి ఎలా బయటపడాలి, పార్టీతో దీర్ఘకాలం ప్రయాణం ఎలా కొనసాగించాలన్న అంశాలు పంచుకునేందుకే ఈ సమీక్ష ఏర్పాటు చేశామని అన్నారు.
‘మార్పు’ అనేది స్పష్టంగా కనిపిస్తోంది
జనసేన పార్టీ అధ్యక్షుడు రాజకీయ సలహాదారు పి.రామ్మోహన్ రావు మాట్లాడుతూ, పార్టీ గెలుపు కోసం పని చేసిన ప్రతి ఒక్కరినీ గౌరవించాలని అన్నారు. ‘మార్పు’ అనేది స్పష్టంగా కనిపిస్తోందని, ఈ నెల 23న జరగనున్న కౌంటింగ్‌కు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా కౌంటింగ్ ఏజెంట్ల నియామకంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వెయ్యి, అయిదు వందల ఓట్లు తేడాలు చాలా చోట్ల వస్తాయని, కౌంటింగ్ ఏజెంట్లు జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. ఈ సమావేశంలో కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అభ్యర్థులకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన బుక్‌లెట్‌ను పార్టీ అధినేత పవన్‌కల్యా ణ్ ఆవిష్కరించారు. ఈ బుక్ లెట్ ను ఈ సమావేశానికి హాజరైన అభ్యర్థులకు అందజేశారు. ఈ సమీక్షలోజనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మాదాసు గంగాధరం, పలువురు పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు.