Russia: ఈ రష్యా సైనికురాలి అందానికి లోకం ఫిదా!
- రష్యా సైన్యంలో ఫొటో బ్యూటీ కాంటెస్ట్
- విజేతగా నిలిచిన అన్నా ఖ్రామ్ ట్సోవా
- ఓటింగ్ లో పాల్గొన్న 57,000 మంది రష్యన్లు
ఒకప్పుడు మిలిటరీ అంటే పురుషులకు మాత్రమే పరిమితం అని భావించేవాళ్లు. ఆ తర్వాత ప్రభుత్వాల దృక్పథాల్లో మార్పు రావడంతో స్త్రీలను కూడా సాయుధ బలగాల్లో చేర్చడం మొదలైంది. రష్యాలో కూడా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కింద రష్యన్ నేషనల్ మిలిటరీ గార్డ్ అనే సాయుధ దళం పనిచేస్తోంది. దీంట్లో కొన్ని వేల మంది మహిళలు తుపాకీ చేతబట్టి విధులు నిర్వర్తిస్తున్నారు. తాజాగా, నేషనల్ గార్డ్ దళం ఫొటో బ్యూటీ కాంటెస్ట్ నిర్వహించింది.
తమ దళంలో ఉన్న మహిళా గార్డులను వారి అందమైన ఫొటోలను కాంటెస్ట్ కోసం పంపించాల్సిందిగా సూచించింది. దాదాపు 1000కి పైగా ఫొటోలు రాగా, అత్యంత అందమైన మహిళా గార్డుగా 31 ఏళ్ల అన్నా ఖ్రామ్ ట్సోవా ఎంపికైంది. మొత్తం 57000 మంది రష్యన్లు ఓటింగ్ లో పాల్గొనగా, అత్యధికులు అన్నా సౌందర్యానికి ముగ్ధులయ్యారు. అన్నా ఫొటోలు చూస్తే ఆమె సౌందర్యవతి అనడంలో ఎవరూ సందేహించరు.
అయితే, అంతటి అపురూప లావణ్యవతి తుపాకీ చేతబట్టి సాయుధ దళాల్లో పనిచేయడం ఏంటన్న సందేహం రాకమానదు. అందుకు బలమైన కారణం ఉంది. ఓ బిడ్డకు తల్లి కూడా అయిన అన్నా బాల్యం నుంచి మిలిటరీలో చేరాలన్న కాంక్షతోనే పెరిగింది. ఆమె తల్లిదండ్రులిద్దరూ ఆర్మీ అధికారులే కావడం విశేషం. అతివలు అన్ని రంగాల్లో రాణిస్తారని నిరూపించడమే తన ఉద్దేశం అని ఫొటో బ్యూటీ కాంటెస్ట్ లో గెలిచిన అన్నా ఎంతో ధీమాగా చెబుతోంది. కాగా, ఈ పోటీలో గెలిచిన మరో 12 మంది ముఖచిత్రాల సహా వచ్చే ఏడాది నేషనల్ గార్డ్ క్యాలెండర్ రూపొందించనున్నారు.