Noida: ఐపీఎస్ అధికారి ఇంట్లో రూ.1000 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
- అధికారుల దాడుల్లో 1.8 టన్నుల డ్రగ్స్ స్వాధీనం
- దేశంలో ఇంత పెద్దమొత్తంలో డ్రగ్స్ పట్టుబడడం ఇదే తొలిసారి!
- తనకేమీ తెలియదంటున్న ఐపీఎస్ అధికారి
ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో ఓ ఐపీఎస్ అధికారికి చెందిన ఇంట్లో రికార్డు స్థాయిలో డ్రగ్స్ పట్టుబడడం సంచలనం సృష్టిస్తోంది. యూపీ పోలీస్ డిపార్ట్ మెంట్ ఫైనాన్స్ విభాగంలో అధికారిగా పనిచేస్తున్న సదరు ఐపీఎస్ ఆ ఇంటిని ఓ మధ్యవర్తి ద్వారా అద్దెకిచ్చారు. అయితే, ఆ ఇంట్లో కొందరు వ్యక్తులు పెద్ద ఎత్తున డ్రగ్స్ తయారుచేస్తూ దొరికిపోయారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల దాడుల్లో ఆ ఇంట్లో ఏకంగా 1,818 కేజీల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
దేశంలో ఇంత భారీమొత్తంలో మాదకద్రవ్యాలు పట్టుబడడం ఇదే ప్రథమం. తాజా దాడుల్లో పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ.1000 కోట్లకు పైనే ఉంటుందని తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీ విమానాశ్రయంలో 31 ఏళ్ల వయసున్న విదేశీయురాలు అనుమానాస్పదంగా కనిపించడంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆమె వద్ద 24 కిలోల డ్రగ్స్ లభ్యం కావడంతో ఆమెను మరింత లోతుగా విచారించారు. ఆమె ఇచ్చిన సమాచారం ఆధారంగా తీగ లాగితే డొంక కదిలింది.
ఆ విదేశీ మహిళ చెప్పిన వివరాల ఆధారంగా నోయిడాలోని ఇంటిపై దాడి చేయడంతో భారీ డ్రగ్స్ తయారీ కేంద్రం గుట్టురట్టయింది. ఈ ఘటనలో ఇద్దరు నైజీరియన్లను, మరో దక్షిణాఫ్రికా దేశస్తుడ్ని అరెస్ట్ చేశారు. అక్రమంగా రసాయనాలు తీసుకువచ్చి, ఆ ఐపీఎస్ అధికారి ఇంట్లో డ్రగ్స్ తయారుచేస్తున్నట్టు నిందితులు అంగీకరించారు. అక్కడ తయారైన డ్రగ్స్ ఢిల్లీతో పాటు పలు దేశాలకు కూడా ఎంతో రహస్యంగా పంపిస్తున్నట్టు అధికారుల విచారణలో తేలింది.
కాగా, తన ఇంట్లో డ్రగ్స్ ముఠా దొరికిపోవడం పట్ల ఐపీఎస్ అధికారి వివరణ ఇచ్చారు. వారితో తనకేమీ సంబంధం లేదని, తాను ఇల్లు అద్దెకిచ్చానని, వారేం చేస్తున్నది తనకు తెలియదని స్పష్టం చేశారు.