Digvijaya Singh: ఈసారి ఓటేయలేకపోయా.. వచ్చేసారి తప్పకుండా వేస్తా: డిగ్గీరాజా పశ్చాత్తాపం

  • ఆదివారం దేశవ్యాప్తంగా 59 స్థానాలకు పోలింగ్
  • సొంతూరు వెళ్లి ఓటు వేయలేకపోయిన దిగ్విజయ్
  • ఈసారి భోపాల్‌కు మార్చుకుని ఓటేస్తానన్న దిగ్విజయ్

నిన్న జరిగిన ఆరో విడత ఎన్నికల్లో ఓటు వేయలేకపోయిన మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పాశ్చాత్తాపం వ్యక్తం చేశారు. వచ్చేసారి తప్పకుండా ఓటేస్తానని అన్నారు. భోపాల్ నుంచి బరిలో ఉన్న దిగ్విజయ్ సింగ్ ఆదివారం వివిధ ప్రాంతాలు తిరుగుతూ ఓటింగ్ సరళిని పరిశీలిస్తూ బిజీగా గడిపారు. దీంతో 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన సొంతూరు రాజ్‌గఢ్‌కు వెళ్లి ఓటు వేయలేకపోయారు.

దిగ్విజయ్ ఓటు హక్కు వినియోగించుకోకపోవడంపై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర విమర్శలు చేశారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ప్రజాస్వామ్యంపై ఏమాత్రం గౌరవం లేదని, అందుకే ఆయన ఓటు వేయలేదని ఆరోపించారు. చుట్టుముడుతున్న ఆరోపణలపై స్పందించిన దిగ్విజయ్ ఓటు వేయకపోవడం తప్పేనంటూ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఈసారి భోపాల్‌లో తన ఓటును నమోదు చేసుకుంటానని, తప్పకుండా ఓటేస్తానని పేర్కొన్నారు. కాగా, ఆదివారం జరిగిన ఆరో విడత ఎన్నికల్లో 62.02 శాతం పోలింగ్ నమోదైంది. ఉత్తరప్రదేశ్, హరియాణా, పశ్చిమ బెంగాల్, బీహార్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, జార్ఖండ్‌లలోని 59 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

  • Loading...

More Telugu News