NTR: ఎందుకొచ్చిన గోలని... 'కథానాయకుడు', 'మహానాయకుడు' చూడలేదు: దర్శకుడు తేజ
- ఎన్టీఆర్ కు న్యాయం చేయలేననిపించింది
- అందుకే దర్శకత్వ బాధ్యతలను వదిలేశా
- బాలయ్యతో గొడవలు లేవని చెప్పిన తేజ
ఎన్టీఆర్ తనకు అభిమాన నటుడని, ఆయన సినిమాలు చూస్తూ పెరిగానని వెల్లడించిన దర్శకుడు తేజ, ఆయన బయోపిక్ గా రూపొందిన మహానాయకుడు, కథానాయకుడు చిత్రాలను తాను చూడలేదని చెప్పారు. ఈ రెండు సినిమాలకు తొలుత తేజను దర్శకుడిగా తీసుకున్న సంగతి తెలిసిందే. షూటింగ్ ప్రారంభమైన తొలినాళ్లలోనే తేజ, ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఇక తాజాగా, అప్పుడు తాను అటువంటి నిర్ణయం తీసుకున్న కారణాన్ని తేజ వివరించాడు.
ఎన్టీఆర్ చరిత్ర లోతుల్లోకి వెళ్లిన తరువాత, తానైతే ఆయనకు న్యాయం చేయలేనని అనిపించిందని, అందువల్లే దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నానని, బాలకృష్ణతో గొడవలేమీ రాలేదని అన్నారు. ఇక ఆ సినిమాలు చూస్తే, తానైతే ఎలా తీసుంటానో అన్న ఆలోచనలు చుట్టుముడతాయని, ఏ అభిప్రాయాన్ని అయినా నిర్మొహమాటంగా, కుండబద్దలు కొట్టినట్టు చెప్పే తాను, ఎందుకొచ్చిన గోలని వాటిని తిలకించలేదని స్పష్టం చేశారు.
ఆ సినిమాలు చేయకపోవడం వల్ల తనకిప్పుడు మంచి పేరు వచ్చిందని, తాను చేసుంటే సినిమా ఇంకా బాగా వచ్చుండేదన్న కామెంట్లు వచ్చాయని తేజ వ్యాఖ్యానించారు. అటువంటి కామెంట్లను తాను పట్టించుకోలేదని, సినిమాలు ఆడకపోయినా, క్రిష్ లేదా బాలకృష్ణను తగ్గించి చెప్పాల్సిన అవసరం తనకు లేదని అన్నారు.