Telangana: తెలంగాణలో ‘పబ్ జీ’ గేమ్ కు మరో బాలుడి బలి!
- సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో ఘటన
- వివాహ వేడుకకు హాజరైన కుటుంబం
- ఫోన్ లో మునిగిపోయి కారులో ఇరుక్కున్న మైనర్
ప్రమాదకరమైన ‘పబ్ జీ’ గేమ్ కారణంగా మరో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆడుకుంటూ కారులో ఉండిపోవడంతో ఊపిరాడక చనిపోయాడు. తెలంగాణలోని సిరిసిల్ల జిల్లాలో నిన్న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని వేములవాడ పట్టణంలో జరిగిన వివాహ వేడుకకు చరణ్(9) తన తల్లిదండ్రులతో కలిసి వచ్చాడు. ఈ సందర్భంగా ఫోన్ లో పబ్ జీ గేమ్ లో లీనమై పోయాడు.
అందరూ దిగిపోయినా తను మాత్రం కారులో కూర్చుని పబ్ జీ ఆడటంలో నిమగ్నమై పోయాడు. ఈ క్రమంలో కారు డోర్ పడిపోవడంతో ఆటోమేటిక్ లాక్ అయిపోయింది. కొద్దిసేపటికి ఊపిరి ఆడకపోవడంతో బాలుడు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. అయితే పెళ్లి పనుల్లో పడిపోయిన కుటుంబ సభ్యులు చరణ్ ను గమనించలేదు. దీంతో ఊపిరాడక పిల్లాడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.
ఈ నేపథ్యంలో కొద్దిసేపటి తర్వాత కుమారుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు బంధువులు వెతుకులాట ప్రారంభించారు. కారులో చరణ్ ను గుర్తించి ఆసుపత్రికి తరలించగా, పిల్లాడు కోమాలోకి వెళ్లాడని వైద్యులు తెలిపారు. అనంతరం కొద్దిసేపటికే బాలుడు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. దీంతో పబ్ జీ గేమ్ లో మునిగిపోయి తమ పిల్లాడు ప్రాణాలు కోల్పోయాడని బాధిత కుటుంబం, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.