Andhra Pradesh: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును చూస్తే జాలి వేస్తోంది!: మాజీ ఎంపీ చింతా మోహన్

  • బాబు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారు
  • బీజేపీకి ఈసారి 150 సీట్లకు మించి రావు
  • తిరుపతిలో మీడియాతో కాంగ్రెస్ పార్టీ నేత

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రస్తుత పరిస్థితి చూస్తే తనకు జాలి వేస్తోందని లోక్ సభ మాజీ సభ్యుడు, కాంగ్రెస్ నేత చింతా మోహన్ వ్యాఖ్యానించారు. ఏపీ ముఖ్యమంత్రి పక్కా అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తిరుమల, తిరుపతిలో వడ్డీ వ్యాపారుల దందా యథేచ్ఛగా కొనసాగుతోందని ఆరోపించారు.

త్వరలోనే కేంద్రంలో లౌకికవాద ప్రభుత్వం ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. బీజేపీకి ఈసారి 150కి మించి లోక్ సభ సీట్లు దక్కవని అభిప్రాయపడ్డారు. తిరుపతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో చింతా మోహన్ మాట్లాడారు.

తిరుమలలో వడ్డీ వ్యాపారుల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరి వెనుక కొందరు టీటీడీ విజిలెన్స్ అధికారులు ఉన్నారని ఆరోపించారు. వ్యాపారుల తరఫున వడ్డీ సొమ్మును సాక్షాత్తూ విజిలెన్స్ అధికారులే వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

ఇప్పటికైనా తిరుమలలో జరుగుతున్న దారుణాలను గవర్నర్ నరసింహన్, డీజీపీ ఆర్పీ ఠాకూర్ నిలువరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 23 తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలో దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News