KCR: రంగనాథ స్వామిని దర్శించుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్!
- కుటుంబ సభ్యులతో కలిసి తమిళనాడు టూర్
- ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ సీఎం
- నేడు డీఎంకే అధినేత స్టాలిన్ తో ప్రత్యేక సమావేశం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు తమిళనాడులోని రంగనాథస్వామి దేవాలయాన్ని సందర్శించుకున్నారు. తిరుచునాపల్లిలోని ఆలయానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన కేసీఆర్ కు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా కేసీఆర్ దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా కేంద్రంలో కొత్త కూటమి ఏర్పాటుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డీఎంకే అధినేత స్టాలిన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలుసుకున్నారు.
తాజాగా ఈరోజు సాయంత్రం కేసీఆర్ డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తో మరోసారి సమావేశమవుతారని అధికారిక వర్గాలు తెలిపాయి. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు, లోక్ సభ ఫలితాలపై చర్చిస్తారని పేర్కొన్నాయి.