Amit Shah: నేనొస్తే దీదీ మేనల్లుడు ఓడిపోతాడని నా హెలికాప్టర్ ను దిగనివ్వలేదు: అమిత్ షా
- జాదవ్ పూర్ లో అమిత్ షా హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుమతి నిరాకరణ
- రోడ్డుమార్గంలో వచ్చిన బీజేపీ చీఫ్
- మమతకు సవాలు
లోక్ సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీజేపీల మధ్య పోరు తీవ్రరూపం దాల్చింది. పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ ఆధిపత్యానికి గండికొట్టాలని కృతనిశ్చయంతో ఉన్న కమలనాథులు అందుబాటులో ఉన్న అన్ని అస్త్రాలను దీదీపై ఎక్కుపెడుతున్నారు.
తాజాగా, బీజేపీ చీఫ్ అమిత్ షా కూడా మమతపై నిప్పులు చెరిగారు. పశ్చిమ బెంగాల్ సీఎం తనను చూసి భయపడిపోతోందని ఎద్దేవా చేశారు. మమత మేనల్లుడు పోటీ చేస్తున్న నియోజకవర్గంలో తాను ప్రచారం చేస్తే అతడి ఓటమి ఖాయమని తెలియడంతో తన హెలికాప్టర్ ను కిందికి దిగనివ్వకుండా అడ్డుకున్నారని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు.
చివరి దశలో పోలింగ్ జరిగే జాదవ్ పూర్ నియోజకవర్గంలో అమిత్ షా ప్రచారం చేయాల్సి ఉండగా, ఆయన హెలికాప్టర్ ల్యాండింగ్ కు అధికారులు అనుమతి నిరాకరించారు. దాంతో ఆయన రోడ్డు మార్గాన వెళ్లాల్సి వచ్చింది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ గడ్డపై నుంచే తాను జై శ్రీరామ్ నినాదం చేస్తున్నానని, మరికాసేపట్లో కోల్ కతా వెళతానని, దమ్ముంటే అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు.