Rahul Gandhi: బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటూ సొంత పార్టీ నేతపై రాహుల్ ఫైర్
- సిక్కుల ఊచకోతపై శ్యామ్ పిట్రోడా అసందర్భ వ్యాఖ్యలు
- శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన కాంగ్రెస్ చీఫ్
- ఫోన్ చేసి చెడామడా దులిపేసిన వైనం
కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ సొంత పార్టీ నేత శ్యామ్ పిట్రోడాపై నిప్పులు చెరుగుతున్నారు. అందుకు బలమైన కారణమే ఉంది. శ్యామ్ పిట్రోడా ఇటీవలే సిక్కుల ఊచకోతపై మాట్లాడుతూ, అయితే ఏంటి? అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో విపక్షాలకు సరైన ఆయుధం దొరికినట్టయింది. పిట్రోడా చేసిన వ్యాఖ్యలను బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ మొత్తానికి ఆపాదిస్తుండడం పట్ల రాహుల్ రగిలిపోతున్నారు.
ఈ నేపథ్యంలో, రాహుల్ సొంత పార్టీ నేత అని కూడా చూడకుండా శ్యామ్ పిట్రోడాకు ఫోన్ చేసి చీవాట్లు పెట్టారు. అంతేకాకుండా, పిట్రోడా తాను చేసిన వ్యాఖ్యలకు బహిరంగంగా అందరికీ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. 1984 సిక్కుల ఊచకోతపై పిట్రోడా చేసిన వ్యాఖ్యలు సమంజసంగా లేవని తాము గుర్తించామని, వెంటనే అతడితో మాట్లాడి తప్పుడు వ్యాఖ్యలు చేసినట్టు గుర్తుచేశామని రాహుల్ వివరించారు.
ఇప్పటికే శ్యామ్ పిట్రోడా జరిగిందేదో జరిగిపోయిందంటూ నష్టనివారణ చర్యలకు దిగినా రాహుల్ మాత్రం ససేమిరా అంటున్నారు. పిట్రోడా బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ ఒత్తిడి తెస్తున్నారు.