TV9: నేడు విచారణకు రాకుంటే చట్టపరంగా చర్యలు: టీవీ9 రవిప్రకాశ్ కు పోలీసుల వార్నింగ్!
- నిన్న రాత్రి రవిప్రకాశ్ ఇంటికి పోలీసులు
- గోడకు నోటీసులు అంటించి వచ్చిన అధికారులు
- ఐదు రోజులుగా అజ్ఞాతంలో రవిప్రకాశ్, శివాజీ
టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ కు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే రెండు సార్లు నోటీసులు జారీ చేసినా, ఆయన స్పందించక పోవడంతో నిన్న సాయంత్రం మరోసారి నోటీసులు జారీ చేశారు. బంజారాహిల్స్ లోని రవిప్రకాశ్ నివాసానికి వెళ్లిన పోలీసులకు, ఆయన కనిపించక పోవడంతో గోడకు నోటీసులు అంటించారు.
మంగళవారం నాడు సైబర్ క్రైమ్ పీఎస్ లో విచారణకు రాకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. ఏబీసీఎల్ కంపెనీ సెక్రెటరీ దేవేంద్ర సంతకాన్ని ఫోర్జరీ చేసినట్టు టీవీ 9 చానెల్ యాజమాన్య సంస్థ అలంద మీడియా రవిప్రకాశ్ పై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ల నియామకంలో అడ్డుపడటం, ఫోర్జరీ పత్రాల సృష్టి, నటుడు శివాజీతో కలిసి నకిలీ పత్రాల తయారు.. వంటి అంశాలను పోలీసులు తమ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఈ కేసులో నటుడు శివాజీ కూడా ప్రస్తుతం అజ్ఞాతంలోనే ఉన్నారు.