Dubai: దుబాయ్ ఆసుపత్రిలో భారత యువతి అనుమానాస్పద మృతి!
- పుట్టుకతోనే శారీరక లోపంతో ఉన్న రీటా
- దుబాయ్ లో శస్త్రచికిత్సకు వెళ్లగా మృతి
- తప్పుంటే కఠిన చర్యలుంటాయన్న దుబాయ్ ఆరోగ్య శాఖ
పుట్టుకతోనే స్వల్ప శారీరక లోపం ఉన్న ఓ భారత యువతి, దుబాయ్ లో శస్త్రచికిత్స చేయించుకునేందుకు వెళ్లి అనుమానాస్పద స్థితిలో మరణించింది. హిప్ జాయింట్ ను (తుంటి కీలు) మార్పించుకునేందుకు వెళ్లిన ముంబై ప్రముఖ చెఫ్ రీటా ఫెర్నాండెజ్ మరణించడంపై ఇప్పుడు దుబాయ్ ఆరోగ్య శాఖ విచారణ ప్రారంభించింది. ముంబైలో 'బెట్టీస్ కేక్స్ టేల్స్' పేరిట సొంత బేకరీ, ఓ కిరాణా స్టోర్ ను నిర్వహిస్తున్న ఆమెకు పుట్టుకతోనే తుంటికీలు లోపం ఉండగా, ఆమె నిత్యమూ ఇబ్బంది పడుతుండేవారు.
శస్త్రచికిత్స కోసం ఈ నెల 9న దుబాయ్‌లోని అల్ జహ్రా ఆసుపత్రిలో చేరగా, అక్కడి సర్జన్ సమిహ్ టరబిచి నేతృత్వంలో రెండు గంటలపాటు ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ జరుగుతుండగానే ఆమె మరణించినట్టు డాక్టర్లు చెబుతుండగా, రీటా భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు దుబాయ్ ఆరోగ్యశాఖ దర్యాప్తు ప్రారంభించింది. అయితే, ఈ ఆపరేషన్ సాధ్యాసాధ్యాలు, తదుపరి ఎదురయ్యే సమస్యలు గురించి ముందే వెల్లడించామని ఆసుపత్రి వర్గాలు అంటున్నాయి. తాము దర్యాఫ్తునకు సహకరిస్తామని తెలిపాయి. ఈ శస్త్రచికిత్స విషయంలో ఆసుపత్రి వైద్యుల నుంచి ఏదైనా తప్పు ఉంటే కఠిన శిక్ష ఉంటుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.