YSRCP: సరిగ్గా పదేళ్ల క్రితం ఇదే రోజున... వైఎస్ ను గుర్తు చేసుకుంటున్న వైసీపీ!
- 2009, మే 14న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్
- ఆపై ఎన్నో పథకాలతో ప్రజా సంక్షేమానికి బాటలు
- ప్రజల కోసం ఏమైనా చేసేవారన్న ఆనం
- అన్ని వర్గాలకూ భరోసాను కల్పించారన్న బొత్స
సరిగ్గా పదేళ్ల క్రితం... 2009, మే 14. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు అంతకుముందు జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించి, కాంగ్రెస్ ను తిరిగి అధికారంలోకి తీసుకువచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి, సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు. అదే రోజున ఆయన రైతులకు మేలు కలిగించే ఉచిత విద్యుత్ ఫైల్ పై సంతకం కూడా చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన వైఎస్, తీసుకొచ్చిన ఆరోగ్య శ్రీ, ఫీజ్ రీయింబర్స్ మెంట్, జలయజ్ఞం, 108, 104 వంటి పథకాలు, సేవలు పేదలకు ఎంతో ఉపకరించాయి కూడా. ఆ పథకాలే ఆయన్ను తిరిగి అధికారానికి దగ్గర చేశాయి. వైఎస్ పథకాలతో ప్రయోజనం పొందిన వారంతా ఆయన్ను రెండోసారి తిరిగి ఆశీర్వదించారు.
ఇక వైఎస్ రాజశేఖరెడ్డి సీఎంగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసి పదిహేను సంవత్సరాలు అయిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయన్ను గుర్తు చేసుకుంటున్నారు. సకల వర్గాలకూ అండగా వుండే పథకాల కోసం సమున్నత అధ్యయనం ప్రారంభమైందని ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. తామేదైనా ఓ పథకం గురించి ఆలోచించేలోపే, వైఎస్ దాన్ని చేసి చూపేవారని కొనియాడారు. ప్రజల జీవితాన్ని మరింత మెరుగు పరుస్తుందని భావిస్తే, ఎంతటి క్లిష్టమైన పథకాన్నైనా వైఎస్ అమలు జేసేవారని అన్నారు.
ఉచిత విద్యుత్, బకాయిల మాఫీలను చేసి చూపిన ఘనత ఆయనదేనని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. పేదల కష్టాన్ని చూస్తే వెంటనే చలించిపోయే వైఎస్, తానున్నానన్న భరోసాను అన్ని వర్గాలకూ కల్పించారని అన్నారు. వైఎస్ ఆధ్వర్యంలోనే ఎన్నో సాగునీటి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు జరిగి, పనులు పూర్తయ్యాయని అన్నారు. రైతు దేశానికి వెన్నెముకని నమ్మిన వైఎస్ చేపట్టిన ఎన్నో రైతు సంక్షేమ పథకాలను నేటి పాలకులు తమ ఘనతలుగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
ప్రతి పేదకూ సొంతింటిని దగ్గర చేయాలని, గుడిసెలు లేని రాష్ట్రాన్ని చూడాలని వైఎస్ కలలు కనేవారని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తనకు వ్యక్తిగతంగా, రాజకీయంగా నష్టం కలుగుతుందని తెలిసినా, ప్రజలకోసం ముందడుగు వేసే అటువంటి నేతను తాను చూడలేదన్నారు.