Andhra Pradesh: సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంతో మాకు ఏ సమస్యా లేదు: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
- అధికారుల సహకారంతోనే అభివృద్ధి సాధించాం
- ఈసీ వైఖరిపైనే మా అభ్యంతరం
- ‘ఫణి’ బాధిత రైతులకు నష్టపరిహారం అందజేస్తాం
ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంతో తమకు ఏ సమస్యా లేదని, ఈసీ వైఖరిపైనే తమ అభ్యంతరమని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఏపీ మంత్రి వర్గ సమావేశం ముగిసిన అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, అధికారులతో తమకు ఎలాంటి సమస్యా లేదని, వారి సహకారం వల్లే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించామని అన్నారు.
ఎన్నికల కోడ్ ను అడ్డంపెట్టుకుని ఇబ్బంది పెట్టాలని చూశారని, ‘కోడ్’ అమలులో ఉన్నప్పుడు కొత్త విధాన నిర్ణయాలు మాత్రమే తీసుకోకూడదని అన్నారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు స్పందించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. ‘ఫణి’ తుపాన్ వల్ల ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని, బాధిత రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు.
కాగా, ఉపాధిహామీ పెండింగ్ బిల్లులపై, కేంద్ర నిధులు ఆలస్యం అవుతున్నందు వల్ల బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాలని ఈ భేటీలో మంత్రి వర్గం సూచించింది. సీఎం సహాయనిధి చెక్కులు వెనక్కి రావడంపై అధికారుల వద్ద మంత్రులు ప్రస్తావించారు. తాగునీటి ఎద్దడి నివారణకు తీసుకుంటున్న చర్యల గురించి, పట్టణాల్లో అందుబాటులో ఉన్న నీటి వనరుల గురించి అధికారులు వివరించారు.