KTR: సౌదీలో నన్ను సంపుతుండ్రు...నువ్వే కాపాడన్నా: కేటీఆర్కు బాధితుడి వినతి
- ఉపాధి కోసం ఏజెంట్ మాటలు నమ్మి వచ్చి మోసపోయా
- రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన సమీర్ మొర
- వెంటనే భారత్ ఎంబసీకి సమస్యను నివేదించిన కేటీఆర్
ఉపాధి వెతుక్కుంటూ వచ్చిన తనకు సంబంధం లేని పని అప్పగించడంతో నరకం చూస్తున్నానని, నువ్వే కాపాడాలంటూ రాజన్న సిరిసిల్లా జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన ఎం.డి.సమీర్ అనే యువకుడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మొరపెట్టుకున్నాడు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని ఆయనకు పంపాడు.
'బ్రోకర్ చెప్పిన మాటలు నమ్మి దేశం కాని దేశం వచ్చానన్నా. సంబంధం లేని పని అప్పగించడంతో ఎడారిలో గొర్రెలు మేపుతూ అవస్థలు పడుతున్నా. ఏజెంటు మోసంతో నరక యాతన అనుభవిస్తున్నా. ఇరవై రోజులుగా సరైన తిండిలేదు. సౌదీలో నన్ను సంపుతుండ్రు. మీరు ఆదుకోకుంటే ఇవే నాకు చివరి రోజులులాగా ఉన్నాయి’ అంటూ ఆ వీడియోలో సమీర్ కన్నీటిపర్యంతమయ్యాడు. వెంటనే స్పందించిన కేటీఆర్ సౌదీలో ఉన్న భారత్ ఎంబసీకి సమీర్ గోడును నివేదించి అతను భారత్ కు వచ్చేందుకు సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.