Chandrababu: సర్ ఆర్థర్ కాటన్ స్ఫూర్తి ప్రదాత...ఆయనకు జనం గుండెల్లో సుస్థిర స్థానం ఉంది: చంద్రబాబు
- నీటి విలువ, గొప్పతనం తెలిసిన మహోన్నతుడు
- ఆయన చూపిన మార్గంలోనే నీరు-ప్రగతి వంటి పథకాలు
- పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కూడా ఆయన స్ఫూర్తితోనే
అపర భగీరథుడుగా పేరొందిన సర్ ఆర్థర్ కాటన్ మహాశయుడు గొప్ప స్ఫూర్తి ప్రదాత అని, ఈ కారణంగానే తెలుగు ప్రజలు ఆయనకు గుండెల్లో గుడికట్టి పూజిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. దశాబ్దాల క్రితమే నీటి విలువ, గొప్పతనం గుర్తించిన దార్శనికుడు కాటన్ అని కొనియాడారు.
కాటన్ జయంతి సందర్భంగా నేడు అమరావతిలో ఆయనకు చంద్రబాబు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్ట నిర్మించి ఉభయ గోదావరి జిల్లాలను ధాన్యాగారాలుగా తీర్చిదిద్దిన ఘనత కాటన్దేనన్నారు. ఆయన స్ఫూర్తితోనే 'నీరు-ప్రగతి' వంటి జల సంరక్షణ కార్యక్రమాలు చేపట్టామని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి 70 శాతం పూర్తిచేశామని తెలిపారు. పోలవరం పూర్తయితే రాష్ట్ర భవిష్యత్తే మారుతుందని అన్నారు. కాగా, కాటన్ గొప్ప మానవతావాది అని మంత్రి నారా లోకేశ్ కొనియాడారు. ఆయన సామాజిక సేవ, దార్శనికత గుర్తు చేసుకుందామని ట్విట్టర్లో పేర్కొన్నారు.