bapayya: ఆ సినిమా సమయంలో మాత్రం శ్రీదేవి సందేహాన్ని వ్యక్తం చేసింది: దర్శకుడు కె. బాపయ్య
- శ్రీదేవితో 18 సినిమాలు చేశాను
- ఆమె చాలా క్రమశిక్షణ గల నటి
- అంకితభావం చాలా ఎక్కువ
తెలుగులో అలనాటి అగ్రదర్శకులలో కె. బాపయ్య ఒకరు. ఆనాటి స్టార్ హీరోలందరితోను ఆయన సూపర్ హిట్లు తీశారు. అలాంటి బాపయ్య తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు. "తెలుగులో నేను 20 సినిమాలకి పైగా చేశాను .. ఇక హిందీలో 40 సినిమాలకి పైగా చేశాను. తెలుగు .. హిందీ భాషల్లో కలుపుకుని శ్రీదేవితో 18 సినిమాలు చేశాను.
శ్రీదేవిగారు చాలా క్రమశిక్షణ గల నటి. సెట్ కి వచ్చి తన పని చూసుకుని వెళ్లిపోయేవారు. ఎప్పుడూ ఎక్కడా ఎవరి విషయాల్లోను జోక్యం చేసుకోరు. ఆమెతో 18 సినిమాలు చేసినా ఎప్పుడూ ఆమె వలన ఎలాంటి ఇబ్బంది కలగలేదు. 'వక్త్ కి ఆవాజ్' సినిమా చేస్తున్నప్పుడు మాత్రం, తన పాత్రకి గల ప్రాధాన్యత తగ్గుతుందేమోననే సందేహాన్ని వ్యక్తం చేశారు. అలాంటిదేమీ ఉండదనీ .. ఆమెకి చెప్పినట్టుగానే ఆ పాత్ర నడుస్తుందని నచ్చజెప్పాను. ఆమెకి అంకితభావం చాలా ఎక్కువ .. అదే ఆమెను ఆ స్థాయికి చేర్చింది" అని చెప్పుకొచ్చారు.