Chandrababu: అన్నీ అయిపోయాయి, ఇప్పుడు నేరుగా దాడులు చేస్తూ వాళ్ల నిజస్వరూపం బయటపెట్టుకుంటున్నారు: చంద్రబాబు
- బీజేపీపై ఏపీ సీఎం ఫైర్
- కోల్ కతాలో కాషాయదళం హింస పట్ల ఖండన
- అన్ని పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా చేయి కలపాలంటూ పిలుపు
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బీజేపీపై మరోసారి నిప్పులు చెరిగారు. కోల్ కతాలో నిన్న జరిగిన హింసాత్మక సంఘటనలను ఆయన తీవ్రంగా ఖండించారు. బీజేపీ, దాని కార్యకర్తలు పెచ్చరిల్లిపోతున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
"పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి సీబీఐ, ఈడీ, ఐటీ, ఇలా అన్నిరకాలుగా విఫలయత్నాలు చేసి చివరికి ప్రత్యక్ష హింసకు పాల్పడడం ద్వారా బీజేపీ తన అసలు రంగు బయటపెట్టుకుంది. ప్రముఖ సంఘసంస్కర్త ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని కూల్చివేయడం బీజేపీ నకిలీ జాతీయవాదానికి సూచిక. అమిత్ షా నాయకత్వంలో బీజేపీ సాగిస్తున్న విధ్వంసక కుయుక్తులను ఎదుర్కోవడానికి అన్ని పార్టీలు చేయి కలపాల్సిన తరుణమిదేనని ఈ సంఘటన చాటిచెబుతోంది" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
అమిత్ షా కావాలనే తన గూండాలతో బెంగాల్ లో అల్లర్లు సృష్టించడం దారుణం అని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ లో ఎలాంటి బలం లేని బీజేపీ అక్కడ రాక్షసత్వం ప్రదర్శించి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని ప్రయత్నిస్తోందని, కానీ మోదీ-షాల పాచిక పారదని అన్నారు. హింస ద్వారా రాజకీయాలు నెరపాలనుకుంటే గుజరాత్ నమ్మినట్టు మిగతా దేశం వాళ్లిద్దరినీ నమ్మబోదని స్పష్టం చేశారు. ఇలాంటి సమయంలో తాను మమతా బెనర్జీకి సంఘీభావం తెలుపుతున్నానంటూ చంద్రబాబు మరో ట్వీట్ లో పేర్కొన్నారు.