Andhra Pradesh: ఆర్టీఐ కమిషనర్ గా ఐలాపురం రాజా నియామకం చెల్లదంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్
- సెక్షన్ 50 లోని క్లాజ్-3 నిబంధనల ఉల్లంఘన
- పిటిషన్ వేసిన జన చైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి
- ఈ నెల 29 లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం
ఏపీ రాష్ట్ర సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కమిషనర్ గా ఐలాపురం రాజాను ఇటీవలే నియమించారు. అయితే, ఈ నియామకం చెల్లదంటూ జన చైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఆర్టీఐ యాక్ట్ సెక్షన్ 50 లోని క్లాజ్-3 నిబంధనలు ఉల్లంఘించారని ఆ పిటిషన్ లో ఆరోపించారు. పిటిషనర్ తరపు వాదనలను న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వినిపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆర్టీఐ కమిషనర్ గా రాజాను నియమించారని ఆరోపించారు.
ఈ క్లాజ్ లో నిబంధనల ప్రకారం వ్యాపారస్తులను ఆర్టీఐ కమిషనర్ గా నియమించకూడదన్న విషయం స్పష్టంగా ఉంది కనుక ఆయన నియామకాన్ని రద్దు చేయాలని ఆ పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 29కు వాయిదా వేస్తున్నట్లు వెకేషన్ బెంచ్ పేర్కొంది. ఈ నెల 29 లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
కాగా, ఆర్టీఐ కమిషనర్లుగా ఐలాపురం రాజా, సమాజ సేవకుడు శ్రీరామమూర్తి పేర్లను సిఫారసు చేస్తూ గవర్నర్ కు ఏపీ ప్రభుత్వం ఫైల్ పంపింది. అయితే, ఐలాపురం రాజా నియామకానికి గవర్నర్ అంగీకారం తెలిపి, శ్రీరామమూర్తి విషయాన్ని మాత్రం పెండింగ్ లో పెడుతూ ప్రభుత్వాన్ని వివరణ కోరారు.