Reena Dwivedi: ఓటింగ్ శాతం అనేది పసుపు లేదంటే నీలి రంగు చీరలను కట్టుకుని రావడంపై ఆధారపడదు: రీనా ద్వివేది
- రెండు సార్లు ఎన్నికల విధులకు హాజరయ్యా
- అప్పుడు కూడా నా ఫోటో వాట్సాప్‌లో వచ్చింది
- నేనేమీ సెలబ్రిటీని కాను.. సాధారణ మహిళనే
ఓటింగ్ శాతం నమోదవడం అనేది ప్రజల్లో చైతన్యంపై ఆధారపడి ఉంటుంది కానీ పసుపు రంగు చీరనో.. నీలి రంగు చీరనో కట్టుకుని రావడంపై కాదని ఉత్తర ప్రదేశ్ పోలింగ్ అధికారిణి రీనా ద్వివేది పేర్కొన్నారు. లక్నోలో ప్రజా పన్నుల విభాగంలో రీనా పని చేస్తున్నారు. ఐదో విడత పోలింగ్ సందర్భంగా ఆమె ఈవీఎం బాక్స్‌ను చేతిలో పెట్టుకుని వెళుతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ తరువాత కూడా ఆమెకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
దీనిపై స్పందించిన రీనా ద్వివేది మాట్లాడుతూ, గతంలో కూడా రెండు పర్యాయాలు ఎన్నికల విధులకు తాను హాజరయ్యానని, అప్పుడు కూడా తన ఫోటో వాట్సాప్‌లో వచ్చిందని అన్నారు. కానీ అప్పుడు ఇప్పట్లా సామాజిక మాధ్యమాలు, ఎలక్ట్రానిక్ మీడియాలో వైరల్ కాలేదన్నారు. తానొక సాధారణ మహిళనని, సెలబ్రిటీని కానని అన్నారు. ప్రస్తుతం తన జీవితం చాలా బిజీగా మారిందని, మీడియాతో పాటు తనకు ఎందరి నుంచో ఫోన్ కాల్స్ వస్తున్నాయన్నారు. తాను పని చేసిన పోలింగ్ కేంద్రంలో దాదాపు 70 శాతం పోలింగ్ నమోదైందని రీనా తెలిపారు.