Andhra Pradesh: ఎన్నికల సంఘం చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తోంది: కళా వెంకట్రావు
- ఏపీలో 49 పోలింగ్ కేంద్రాల్లో అవకతవకలు జరిగాయి
- ఈసీ అధికారులు పారదర్శకంగా వ్యవహరించట్లేదు
- చంద్రగిరిలోని 166, 310 పోలింగ్ కేంద్రాల్లోనూ రీపోలింగ్ నిర్వహించాలి
ఏపీలో ఎన్నికల సంఘం చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 49 పోలింగ్ కేంద్రాల్లో అవకతవకలు జరిగాయని, ఆయా కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అదనపు సీఈవో సుజాత శర్మను కలిసి ఫిర్యాదు చేశారు.
అనంతరం, మీడియాతో కళా వెంకట్రావు మాట్లాడుతూ, పోలింగ్ రోజున చంద్రగిరి నియోజకవర్గంలోని రెండు పోలింగ్ కేంద్రాల్లో జరిగిన అవకతవకలపై తమ అభ్యర్థి ఫిర్యాదు చేసినా ఈసీ పట్టించుకోలేదని విమర్శించారు. పోలింగ్ జరిగిన ఇరవై నాలుగు రోజుల తర్వాత వైసీపీ అభ్యర్థి కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఫిర్యాదు చేస్తే ఈసీ విచారణకు ఆదేశించిన విషయాన్ని గుర్తుచేశారు. ఎన్నికల సంఘం అధికారులు పారదర్శకంగా వ్యవహరించడం లేదని విమర్శించారు. చంద్రగిరి నియోజకవర్గంలోని 166, 310 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.