West Bengal: బెంగాల్ లో రేపటితో ప్రచారం ఆపేయండి.. మొదటిసారిగా 324 అధికరణ చట్టం ప్రయోగించిన ఈసీ!
- రాజకీయ పక్షాలకు ఈసీ ఆదేశం
- బెంగాల్ లో హింసాత్మక ఘటనలు
- తీవ్రంగా పరిగణించిన ఈసీ
పశ్చిమ బెంగాల్ లో బీజేపీ, అధికార తృణమూల్ కాంగ్రెస్ మధ్య ఆధిపత్య పోరు నేపథ్యంలో హింసాత్మక ఘటనలు పెరిగిపోతుండడం పట్ల ఎన్నికల సంఘం సీరియస్ అయింది. రేపటితో బెంగాల్ లో ప్రచారానికి స్వస్తి చెప్పాలంటూ అన్ని రాజకీయపక్షాలను ఆదేశించింది. ఈ మేరకు మొదటిసారిగా 324 అధికరణ చట్టాన్ని ప్రయోగించింది. ఎన్నికల సంబంధిత దుష్ప్రవర్తనను, అవాంఛనీయ ఘటనలను నివారించడానికి ఈ చట్టం ఉపయోగిస్తారు.
వాస్తవానికి చివరి దశ పోలింగ్ కు సంబంధించి ఎల్లుండితో ప్రచారం ముగుస్తుంది. అయితే, కోల్ కతాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఎన్నికల సంఘం ఒకరోజు ముందుగానే ప్రచారానికి బ్రేకులు వేసింది.అమిత్ షా ర్యాలీలో దాడులు, బీజేపీ ప్రతినిధుల నిర్బంధం, అరెస్టులతో బెంగాల్ అట్టుడికిపోతోంది. ఎన్నికల సందర్భంగా పశ్చిమ బెంగాల్ పై పట్టుసాధించాలని కాషాయదళం దృఢనిశ్చయంతో ఉండగా, ఎట్టిపరిస్థితుల్లోనూ జారవిడిచేది లేదని సీఎం మమతా బెనర్జీ అంతకుమించిన పట్టుదల కనబరుస్తున్నారు.