mamata banerjee: మమతా బెనర్జీపై నిప్పులు చెరిగిన జీవీఎల్ నర్సింహారావు
- బెంగాల్ లో హింసకు మమతనే కారణం
- ఆమె ప్రచారంపై నిషేధం విధించాలి
- ఓటమి భయంతో మమత, మాయావతి సహకరించుకుంటున్నారు
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్సింహారావు మండిపడ్డారు. మమత ఒక నియంత అని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న వ్యక్తి అని విమర్శించారు. పశ్చిమబెంగాల్ లో చోటు చేసుకున్న హింసకు ఆమే కారకురాలని అన్నారు. ఆమెపై తాను ఎన్ని ఫిర్యాదులు చేసినా ఈసీ సరైన చర్యలు తీసుకోలేదని చెప్పారు. టీఎంసీకి మద్దతు ఇవ్వనివారిపై ప్రతీకారం తీర్చుకుంటానంటూ మమత వ్యాఖ్యానించారని... ఈ నేపథ్యంలో ఆమె ప్రచారంపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఎన్నుకొన్న ఒక ముఖ్యమంత్రి ఇలా మాట్లాడటం కంటే పెద్ద ముప్పు ప్రజాస్వామ్యానికి ఇంకేం ఉంటుందని ప్రశ్నించారు.
మమతా బెనర్జీకి మద్దతు పలికిన మాయావతిపై కూడా జీవీఎల్ విమర్శలు గుప్పించారు. బీజేపీపై మమత, మాయావతి అనవసర ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఓటమి భయంతోనే వీరిద్దరూ ఒకరికొకరు సహకరించుకుంటున్నారని చెప్పారు. బెంగాల్ లో ఎందరో బీజేపీ కార్యకర్తలను టీఎంసీ వర్గీయులు చంపేశారని మండిపడ్డారు.