mamata banerjee: ఏపీ, తమిళనాడులో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో జోస్యం చెప్పిన మమతా బెనర్జీ
- ఏపీ, తమిళనాడులో బీజేపీకి సున్నా
- మహారాష్ట్రలో 20 సీట్లకు మించి రావు
- మొత్తం మీద 200 సీట్లను బీజేపీ కోల్పోతుంది
ఈ ఎన్నికల్లో బీజేపీకి 100 సీట్ల లోపులోనే వస్తాయని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జోస్యం చెప్పారు. బీజేపీని ఒక గూండా పార్టీగా ఆమె అభివర్ణించారు. డబ్బు వెదజల్లుతూ ఓట్లను కొంటున్నారని ఆరోపించారు. ఏపీ, తమిళనాడులో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని అన్నారు. మహారాష్ట్రలో కూడా 20 సీట్లకు మించి రావని... మొత్తం మీద బీజేపీ 200 సీట్లను కోల్పోనుందని చెప్పారు.
ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని టీఎంసీ గూండాలు ధ్వంసం చేశారంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. మోదీ అబద్ధాలకోరు అని అన్నారు. మోదీ తన ఆరోపణలను నిరూపించుకోవాలని... లేని పక్షంలో ఆయనను జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.
విగ్రహాన్ని పునర్నిర్మించే డబ్బు బెంగాల్ వద్ద ఉందని... కానీ, 200 ఏళ్ల వారసత్వ సంపదను మోదీ మళ్లీ తీసుకురాగలరా? అని మమత ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తలే విగ్రహాన్ని కూల్చారనే ఆధారాలు తమ వద్ద ఉన్నాయని... కానీ మోదీ మాత్రం టీఎంసీనే ఆ పని చేసిందని అంటున్నారని మండిపడ్డారు. ఇలా మాట్లాడటానికి మీరు సిగ్గుపడటం లేదా? అని ఆమె ప్రశ్నించారు.