High Court: ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన కమలహాసన్
- నా వ్యాఖ్యలు గాడ్సేకు మాత్రమే పరిమితం
- చారిత్రక వాస్తవమే మాట్లాడా
- నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు
మక్కల్‌నీది మయ్యం అధ్యక్షుడు, ప్రముఖ నటుడు కమలహాసన్ గాడ్సేను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తమిళనాడు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోపక్క జాతీయ భద్రతా చట్టం కింద కమల్‌ను అరెస్ట్ చేయాలంటూ చెన్నై కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు అందింది. అయితే తనపై నమోదైన కేసును కొట్టి వేయాలని కోరుతూ కమల్ సమర్పించిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు మధురై బెంచ్ తిరస్కరించింది. ప్రస్తుతం వేసవి సెలవుల నేపథ్యంలో ఇలాంటివి పరిశీలించడం సాధ్యపడదని న్యాయమూర్తి జస్టిస్ బి.పుగళేంది స్పష్టం చేశారు. దీంతో కమల్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్‌ను దాఖలు చేశారు.
తన వ్యాఖ్యలు గాడ్సేకు మాత్రమే పరిమితమని, మొత్తం హిందువులకు సంబంధించినవి కావని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కమల్ మీడియాతో మాట్లాడుతూ, తాను అరవకురిచ్చిలో మాట్లాడిన విషయంపై అందరికీ కోపం వస్తోందని, స్వతంత్ర భారతదేశంలో తొలి తీవ్రవాది అని తాను ఒక్కసారి చెప్తే, మీడియా 200 సార్లు చెబుతోందన్నారు. తాను చారిత్రక వాస్తవాన్ని మాట్లాడానని, దీనిపై కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. తనను అవమానపరిచేందుకు యత్నిస్తే వాళ్లే ఓడిపోతారని కమల్ పేర్కొన్నారు.