TV9: టీవీ9 చానల్ లోగోను రూ.99 వేలకు అమ్మేసిన రవిప్రకాశ్.. కేసు నమోదు
- రవి ప్రకాశ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
- టీవీ9 సహా ఆరు లోగోలను అక్రమంగా విక్రయించారంటూ కేసు
- రవిప్రకాశ్ దురుద్దేశ పూర్వకంగా వ్యవహరించారన్న కౌశిక్ రావు
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. టీవీ9 చానల్ లోగో సహా ఆరు లోగోలను తన సొంత చానల్ మోజో టీవీకి అమ్మేశారంటూ ఆయనపై మరో కేసు నమోదైంది. ఏబీసీపీఎల్ డైరెక్టర్ కౌశిక్‌రావు చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. రవిప్రకాశ్, ఎంవీకేఎన్ మూర్తి కలిసి టీవీ9 లోగోలను మోజోటీవీ యాజమాన్య సంస్థ మీడియా నెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.99 వేలకు విక్రయించారని కౌశిక్‌రావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదంతా మౌఖిక ఒప్పందం ప్రకారమే జరిగిందని తెలిపారు. ఈ మేరకు గతేడాది 31న డీడ్ ద్వారా వాటిని రాసి ఇచ్చేసినట్టు వివరించారు.
టీవీ9 లోగోలు అమ్మినందుకు ప్రతిగా రావాల్సిన రూ.99 వేలను నెక్ట్స్ ఇండియా నుంచి ఏబీసీపీఎల్‌కు బదిలీ చేశారని అయితే, ఆ సొమ్మును ‘అదర్ రిపెయిర్స్ అండ్ మెయింటెనెన్స్’గా పేర్కొన్నారని కౌశిక్ రావు తెలిపారు. కోట్ల రూపాయల విలువచేసే లోగోలను రవిప్రకాశ్ అక్రమంగా, దురుద్దేశపూర్వకంగా, కంపెనీ వాటాదారులకు నష్టం కలిగించేలా విక్రయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.