Devineni Uma: జగన్ రెడ్డీ.. అన్నం తినేవాళ్లు ఎవరూ ఇలాంటి పని చేయరు: దేవినేని ఫైర్

  • జగన్ పంపించిన విశ్రాంత అధికారులు పోలవరంపై విషం చిమ్మారు
  • ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు జగన్ కోట్లాది రూపాయలు కుమ్మరించారు
  • 23 తర్వాత కేంద్రంలో చంద్రబాబు కీలక పాత్ర

దేశ రాజకీయాల్లో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కీలక పాత్ర పోషించబోతున్నారని టీడీపీ సీనియర్ నేత, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ నెల 23 తర్వాత చంద్రబాబు దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించబోతున్నట్టు చెప్పారు. వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, పార్టీ అధినేత జగన్, సీనియర్ నేత విజయసాయిరెడ్డి పాపాలు బయటకు రావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని జగన్ కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని ఆరోపించారు.

పోలవరం ప్రాజెక్టుపై సాక్షి పత్రిక దుర్మార్గపు రాతలు రాస్తోందని దేవినేని మండిపడ్డారు. సంస్థల పేరుతో కొందరు రిటైరైన అధికారులను జగన్ పోలవరం ప్రాజెక్టు వద్దకు పంపించారని అన్నారు. డ్యామ్ సైట్‌లో 45 నిమిషాలు కూడా లేని ఆ అధికారులు రాజమండ్రిలో ప్రెస్‌మీట్ పెట్టి కడుపులో ఉన్న విషాన్ని అంతా కక్కేశారని ఆరోపించారు. ప్రాజెక్టు వద్దకు వచ్చిన అధికారులు అక్కడి ఇంజినీర్లతో చర్చించాలని, అలా చేయకుండా రాజమండ్రి వచ్చి ప్రాజెక్టు పనుల్లో సర్వం అవినీతి జరుగుతోందని స్టేట్‌మెంట్ ఇచ్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆధునిక దేవాలయం వంటి ప్రాజెక్టుపై ఇంత దుర్మార్గంగా, బాధ్యతా రాహిత్యంగా ఎలా మాట్లాడతారని నిలదీశారు. పోలవరం ఎవరు వెళ్లినా కనీసం ఐదారు గంటలు ఉంటారని, అలాంటిది గంట కూడా పరిశీలించకుండా బురద జల్లుతున్నారని అన్నారు. అన్నం తినేవారు ఎవరూ ఇలాంటి పని చేయరని జగన్‌ను ఉద్దేశించి మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News