Andhra Pradesh: మంగళగిరిలో ఓ మహిళ ‘అన్నా ఖర్చులకు ఉంచుకో’ అంటూ ఓ కవర్ ఇచ్చింది!: ఆళ్ల రామకృష్ణారెడ్డి
- మంగళగిరి ఫలితాలపై ప్రజలు ఉత్కంఠతో ఉన్నారు
- దుగ్గిరాలలో ఓ పెద్దావిడ నాకు కవర్ ఇచ్చింది
- ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటంతో చెప్పలేకపోయా
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసిన అనంతరం మంగళగిరిలో ఫలితం ఎలా ఉండబోతోందో అని ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. జగన్ అండతో, మంగళగిరి ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ మంగళగిరి నుంచి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. తాను ప్రచారంలో ఉన్నప్పుడు జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలి అనే ఆకాంక్ష బలంగా కనిపించిందన్నారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటనను రామకృష్ణారెడ్డి అభిమానులు, వైసీపీ మద్దతుదారులతో పంచుకున్నారు.
తాను దుగ్గిరాల మండలంలో ఎన్నికల ప్రచారంలో ఉండగా ఓ ఊరిలో 65 ఏళ్ల పెద్దావిడ ఒక కవర్ ఇచ్చిందని ఆర్కే తెలిపారు. అయితే తాను ప్రచారంలో పడిపోయి దాన్ని తెరిచిచూడలేదని చెప్పారు. దానిపై ‘జై ఆర్కే.. అన్నా.. నీ ఖర్చులకు ఉంచు’ అని రాసి ఉందని వెల్లడించారు. ‘ఎన్నికల ప్రచారంలో నేను ఆ కవర్ తీసుకుని జేబులో పెట్టుకున్నా. అమ్మా.. అమ్మా అని మాట్లాడేలోపే ఆవిడ అక్కడినుంచి వెళ్లిపోయింది.
తర్వాత ఇంటికి వచ్చి చూసుకుంటే రూ.50 నోట్లు ఓ 20 ఉన్నాయి. ఓ నిరుపేద మహిళ ఈ వెయ్యి రూపాయలు నాకు ఇచ్చింది. ఈ నగదును చూసిన ఆ రోజున నాకు ఆనందం, బాధ, సంతోషం ఒకేసారి కలిగాయి. జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలన్న తపన ఓ పేద మహిళలో ఎంతగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు’ అని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటంతో ఈ విషయం చెప్పడానికి ఆలస్యం అయిందని ఆర్కే అన్నారు.