Guntur District: గుప్తనిధుల కోసం అడవిలోకి వెళ్లిన రెండో వ్యక్తి కూడా మృతి
- నీళ్ల కోసం అలమటించి ముగ్గురూ తలోదిక్కుకు
- ప్రాణాలతో బయటపడిన కృష్ణా నాయక్
- తప్పిన రెండో వ్యక్తి మృతదేహాన్ని శుక్రవారం గుర్తించిన పోలీసులు
గుప్త నిధుల వేటలో నల్లమల అడవిలోకి వెళ్లిన వారిలో మరో వ్యక్తి కూడా మృత్యువాత పడ్డాడు. గురువారం బ్యాంకు ఉద్యోగి శివకుమార్ (39) మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు అక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలో శుక్రవారం సాయంత్రం హనుమంతు నాయక్ (65) మృతదేహాన్ని గుర్తించారు.
గుంటూరు జిల్లాలోని మున్నంగికి చెందిన హనుమంతునాయక్, కృష్ణానాయక్ (40), హైదరాబాద్లోని ఓ బ్యాంకులో క్యాషియర్ అయిన శివకుమార్ కలిసి గుప్త నిధుల కోసం ఈనెల 12న అడవిలోకి వెళ్లారు. అర్ధ రాత్రి నల్లమలలో ప్రవేశించిన వారు దాదాపు పది కిలోమీటర్ల పాటు నడక సాగించారు. ఈ క్రమంలో వారు తెచ్చుకున్న ఆహారం, నీళ్లు అయిపోవడంతో ఎండవేడికి తట్టుకోలేకపోయారు. ఆకలి, దాహంతో అలమటించిపోయారు. నీటి కోసం గాలిస్తూ తలో దిక్కుకు వెళ్లి తప్పిపోయారు.
కృష్ణానాయక్ ఎలాగోలా బయటపడగా, శివకుమార్, హనుమంతునాయక్లు మృతి చెందారు. కాగా, ప్రాణాలతో బయటపడిన కృష్ణా నాయక్ వాదన మరోలా ఉంది. తాము గుప్తనిధుల కోసం వెళ్లలేదని, రుద్రాక్షల కోసమే అడవిలోకి వెళ్లినట్టు చెప్పాడు. తనకు రోజుకు రూ.500 కూలి ఇస్తామని చెప్పి తీసుకెళ్లారని తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.