kamal haasan: పురాణాల్లో హిందూ అనే పదమే లేదు.. మరోసారి కమలహాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు
- ఆళ్వారులు, నయనారులు వారి కీర్తనల్లో హిందూ పదాన్ని ఉచ్చరించలేదు
- మొఘల్స్ లేదా వారి ముందు వచ్చిన విదేశీ పాలకులు ఆ పదాన్ని తెచ్చారు
- భారతీయుడు అని పిలిపించుకోవడమే బాగుంటుంది
స్వతంత్ర భారతదేశంలో తొలి టెర్రరిస్టు హిందువే అంటూ ఇప్పటికే వివాదానికి తెరలేపిన సినీ నటుడు, ఎంఎన్ఎం అధినేత కమలహాసన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పురాణాల్లో హిందూ పదమే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. 12 మంది ఆళ్వారులు కానీ, 63 మంది నయనారులు కానీ వారి కీర్తనల్లో హిందూ అనే పదాన్ని ఎక్కడా ఉచ్ఛరించలేదని చెప్పారు. మొఘల్ చక్రవర్తులు కానీ, వారికి ముందు వచ్చిన విదేశీ పాలకులు కానీ హిందూ అనే పదాన్ని తీసుకొచ్చారని చెప్పారు. ఆ తర్వాత బ్రిటీష్ హయాంలో హిందూ అనే పదం అధికారికంగా వాడబడిందని తెలిపారు. మనకు ఎన్నో గుర్తింపులు ఉన్నప్పుడు... విదేశీయిలు ఇచ్చిన ఒక పదాన్ని మతంగా వాడాల్సిన అవసరం లేదని చెప్పారు. హిందువు అని పిలిపించుకునే కంటే భారతీయుడు అని పిలిపించుకోవడమే బాగుంటుందని అన్నారు.