Andhra Pradesh: ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందని జగన్ కు ముందే తెలుసు!: టీడీపీ నేత బుద్ధా వెంకన్న
- రాష్ట్రంలో మహిళలంతా టీడీపీవైపే నిలిచారు
- ప్రజలు చంద్రబాబును, సంక్షేమాన్ని నమ్మారు
- రాజగోపాల్ సర్వేకు మించి మాకు సీట్లు వస్తాయి
- అమరావతిలో మీడియాతో టీడీపీ ఎమ్మెల్సీ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పురుషుల ఓట్లు చీలిపోయినప్పటికీ మహిళలు అంతా టీడీపీవైపే నిలిచారని ఆ పార్టీ నేత బుద్ధా వెంకన్న తెలిపారు. గత మూడు ఎన్నికల సందర్భంగా కరెక్టుగా సర్వేలు ఇచ్చిన సంస్థలు ఈసారి ఏపీలో టీడీపీనే అధికారంలోకి రాబోతోందని చెప్పాయని గుర్తుచేశారు. ఎన్టీయే కూటమికి 300కు పైగా సీట్లు వస్తాయని సర్వేలు చేప్పడాన్ని వెంకన్న తప్పుపట్టారు. తటస్థ పార్టీలను ఆకర్షించేందుకే మోదీ ఆయా మీడియా సంస్థలను మేనేజ్ చేశారని ఆరోపించారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో బుద్ధా వెంకన్న మాట్లాడారు.
ఏపీలో టీడీపీ విజయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను, సీఎం చంద్రబాబు నాయుడిని నమ్మారని వ్యాఖ్యానించారు. లగడపాటి రాజగోపాల్ సర్వేకు మించి టీడీపీకి సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఈసారి ఎన్నికల్లో టీడీపీకి 130 సీట్లు గ్యారెంటీ అని చెప్పారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోతుందని జగన్ కు ముందే తెలుసని బుద్ధా వెంకన్న బాంబు పేల్చారు. టీడీపీ శ్రేణులంతా కాలర్ ఎత్తుకుని తిరగాలనీ, ఎందుకంటే మే 23న వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని పునరుద్ఘాటించారు.