East Godavari District: ఎన్నికల కౌంటింగ్ టీడీపీ కార్యాలయంలో నిర్వహించమంటారేమో!: చంద్రబాబుపై కన్నబాబు సెటైర్లు
- ఈవీఎంలపై చంద్రబాబుకు అనుమానాలు తగదు
- 2014 ఎన్నికల్లో ఈవీఎంలే ఉపయోగించారు
- టీడీపీ కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకు లగడపాటి సర్వే
నిన్నటి ఎగ్జిట్ పోల్స్, చంద్రబాబుకు పొలిటికల్ ఎగ్జిట్ పోల్ అని వైసీపీ నేత కురసాల కన్నబాబు వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు కళ్లలో ఓటమి భయం కనిపిస్తోందని అన్నారు. అన్ని సర్వే సంస్థల నివేదికలు వైసీపీ గెలుస్తుందని చెబుతుంటే, లగడపాటి సర్వే మాత్రం అందుకు విరుద్ధంగా చెప్పిందని విమర్శించారు.
టీడీపీ కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకే లగడపాటి సర్వే రిలీజ్ చేశారని ధ్వజమెత్తారు. ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న చంద్రబాబుకు 2014 ఎన్నికల్లో ఈవీఎంలు ఉపయోగించిన విషయం గుర్తులేదా? అని ప్రశ్నించారు. ఓటమి పాలవుతామన్న భయంతోనే ఈసీ ముందు రోజుకో డిమాండ్ ను చంద్రబాబు ఉంచుతున్నారని విమర్శించారు. చంద్రబాబును చూస్తుంటే, ఎన్నికల కౌంటింగ్ టీడీపీ కార్యాలయంలో నిర్వహించమని ఈసీని డిమాండ్ చేస్తారేమో అనిపిస్తోందని సెటైర్లు విసిరారు.
వైసీపీకి మెజార్టీ విజయం లభిస్తుంది: పార్ధసారథి
వైసీపీ అధినేత జగన్ తొమ్మిదేళ్లుగా ప్రజల మధ్యే ఉంటున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్ధసారథి అన్నారు. విజయవాడలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్ తన పాదయాత్ర ద్వారా ప్రజల కష్టనష్టాలను తెలుసుకున్నారని, వారి కష్టాలను దగ్గర నుంచి చూశారని అన్నారు. ‘నవరత్నాలు’తో తమ బతుకులు బాగుపడతాయని భావించిన ప్రజలు జగన్ కు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని అనుకున్నారని వ్యాఖ్యానించారు. వైసీపీకి మెజార్టీ విజయం లభిస్తుందని ప్రముఖ సర్వే సంస్థలు వెల్లడించాయని అన్నారు.