Andhra Pradesh: శేషన్నకు షెల్టర్ ఇవ్వలేదు.. నన్ను ఎన్ కౌంటర్ చేయించాలని టీడీపీ చూస్తోంది: మాజీ మావోయిస్టు వెంకట్ రెడ్డి
- నయీం మృతి తర్వాత మా హోటల్ కు శేషన్న వచ్చేవాడు
- అప్పుడు శేషన్నతో నాకు పరిచయం ఏర్పడింది
- పోలీసులను తప్పించుకుని నేను తిరగట్లేదు
గ్యాంగ్ స్టర్ నయీం ముఖ్య అనుచరుడిగా పేరుపొందిన శేషన్నకు మాజీ మావోయిస్టు వట్టి వెంకట్ రెడ్డి ఆశ్రయం కల్పించారని పోలీసులు అనుమానం వ్యక్తం చేయడం తెలిసిందే. తమ ఆచూకీ పోలీసులకు తెలిసిందన్న సమాచారంతో శేషన్న, వెంకట్ రెడ్డి పరారయ్యారని వారి కోసం పోలీసులు గాలిస్తున్నట్టు వార్తలు వెలువడ్డాయి.
ఈ నేపథ్యంలో వెంకట్ రెడ్డి స్పందించారు. నయీం ఎన్ కౌంటర్ తర్వాత తమ హోటల్ కు శేషన్న వచ్చేవాడని, అప్పుడు అతనితో తనకు పరిచయం ఏర్పడిందని ‘టీవీ 9’తో వెంకట్ రెడ్డి చెప్పారు. శేషన్నతో తనకు పరిచయం ఉన్న మాట వాస్తవమే కానీ, అతనికి షెల్టర్ మాత్రం ఇవ్వలేదని స్పష్టం చేశారు. పోలీసులు తమ ఇంట్లో సోదాలు చేశారని, ఎలాంటి మారణాయుధాలు లభించలేదని స్పష్టం చేశారు.
రాజకీయంగా తనపై కుట్ర జరుగుతోందని, వైసీపీకి అనుకూలంగా పని చేశానని, దీంతో, తెలుగుదేశం పార్టీ నేతలు తనపై కుట్రలు పన్నుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. తనను ఎన్ కౌంటర్ చేయించాలని టీడీపీ చూస్తోందని ఆరోపించారు. పోలీసులను తప్పించుకుని తానేమీ తిరగడం లేదని, త్వరలో పోలీసు ఉన్నతాధికారులను కలుస్తానని వెంకట్ రెడ్డి చెప్పినట్టు ‘టీవీ 9’ పేర్కొంది.