New Delhi: ఢిల్లీలో ఎన్డీఏ నేతల సమావేశం.. ఆ తర్వాత విందు!
- హాజరైన మోదీ, కేంద్ర మంత్రులు, కీలక నేతలు
- ఎన్నికల ఫలితాలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చ
- అశోకా హోటల్ లో నేతలకు విందు ఏర్పాటు
గురువారం ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఎన్డీయే పక్ష నేతలు ఢిల్లీలో సమావేశమయ్యారు. స్థానిక బీజేపీ కార్యాలయంలో ఎన్డీఏ నేతలు కొద్దిసేపటి క్రితం సమావేశం ప్రారంభించారు. ఈ సమావేశానికి ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, బీజేపీ కీలక నేతలు హాజరైనట్లు సమాచారం. ఎన్నికల ఫలితాలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ భేటీ అనంతరం, ఎన్డీఏ నేతలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విందు ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని అశోకా హోటల్ లో ఈ విందు ఇస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, ఎన్డీఏ మళ్లీ అధికారంలోకి రాబోతోందని ఇటీవల వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన సంగతి విదితమే. 282 నుంచి 365 స్థానాల్లో బీజేపీ విజయ ఢంకా మోగించబోతోందని పన్నెండు సంస్థలు తమ సర్వేలో పేర్కొన్నాయి.