Raviprakash: టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ ఆచూకీ కోసం శ్రమిస్తున్న మూడు బృందాలు!
- విచారణకు రాకుండా తప్పించుకు తిరుగుతున్న రవిప్రకాశ్
- రవిప్రకాశ్, నటుడు శివాజీ కోసం గాలింపు ముమ్మరం
- వేర్వేరుగా కేసులను విచారిస్తున్న సైబరాబాద్, హైదరాబాద్ పోలీసులు
తెలుగు న్యూస్ చానెల్ టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కోసం తెలంగాణ పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి, గాలింపును తీవ్రతరం చేశారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులతోపాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా రవిప్రకాశ్ కోసం వెతుకుతున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడో తలదాచుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు శివాజీ కూడా అక్కడే ఉండవచ్చని భావిస్తున్నారు. వీరిని విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ, పోలీసులు పలుమార్లు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. వీరు మాత్రం కోర్టును ఆశ్రయిస్తూ, ముందస్తు బెయిల్ కోసం తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
కాగా, రవిప్రకాశ్ పై నమోదైన రెండు కేసుల్లో ఒకటి హైదరాబాద్, మరొకటి సైబరాబాద్ లో నమోదుకాగా, పోలీసులు ఎవరి కేసు వారిదేనన్నట్టు విచారిస్తున్నారు. నకిలీ పత్రాల సృష్టి, నిధుల మళ్లింపు, ఫోర్జరీ ఆరోపణలపై ఐటీ యాక్ట్, 66, 72, ఐపీసీ సెక్షన్ 406, 420, 467, 469, 471 కింద సైబరాబాద్ పోలీసులు కేసులను నమోదు చేయగా, టీవీ9 లోగో, కాపీరైట్స్, ట్రేడ్ మార్కులను మీడియా నెక్ట్స్ ఇండియాకు బదలాయించడంపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. ఇదిలావుండగా, ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ ఉద్యోగి ఎంకేవీఎన్ మూర్తి, మోజో టీవీ చైర్మన్ హరికిరణ్ లు తమకు సహకరిస్తున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.