Andhra Pradesh: ఎన్నికల తర్వాత లోకేశ్ మౌనంగా ఉండిపోయారు.. చాలా అనుమానాలు వస్తున్నాయి!: ప్రొ.నాగేశ్వర్
- లోకేశ్ ట్విట్టర్ లో కూడా స్పందించడం లేదు
- టీడీపీ గెలిస్తే దాన్ని లోకేశ్ కు అంకితం చేస్తారు
- లోకేశ్ తప్ప టీడీపీలో గూగుల్ చూసేవాళ్లే లేరనుకుంటాను
ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ వ్యవహారశైలి అనేక అనుమానాలు రేకెత్తిస్తోందని ప్రొ.నాగేశ్వర్ అన్నారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నాటి నుంచి లోకేశ్ మీడియాతో మాట్లాడటం మానేశారనీ, చురుగ్గా ఉండే ట్విట్టర్ లో కూడా స్పందించడం లేదని గుర్తుచేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలిచే పరిస్థితి ఉంటే ఆ గెలుపును లోకేశ్ కు అంకితం చేసే ప్రయత్నం చేస్తారని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లోని ఓ టీవీ ఛానల్ లో జరిగిన చర్చా కార్యక్రమంలో నాగేశ్వర్ పాల్గొన్నారు.
ఈసారి టీడీపీకి 110-130 సీట్లు వచ్చే పరిస్థితి ఉంటే లోకేశ్ పట్టాభిషేకానికి రంగం సిద్ధమయ్యేదని నాగేశ్వర్ తెలిపారు. 2009లో ప్రజారాజ్యం రాకతో కాంగ్రెస్ బొటాబొటీ సీట్లతో అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. త్వరలోనే చంద్రబాబుకు 70 ఏళ్లు దాటుతాయని చెప్పారు. కాబట్టి పార్టీ బాధ్యతలను ఈ ఐదేళ్లలోనే లోకేశ్ కు అప్పగించే అవకాశముందని అభిప్రాయపడ్డారు.
నగదు బదిలీ పథకాన్ని నారా లోకేశే తెచ్చినట్లు టీడీపీ నేతలు చెప్పారనీ, అంటే టీడీపీలో లోకేశ్ తప్ప మిగతా ఎవ్వరూ గూగుల్ చూడరని అర్థం చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు. బ్రెజిల్ తో పాటు చాలా ప్రపంచదేశాలు ఇప్పటికే నగదు బదిలీ పథకాన్ని అమలు చేశాయన్నారు.