Michale Slater: ఆసీస్ మాజీ ఓపెనర్ మైఖేల్ స్లాటర్ ను గెంటేసిన క్వాంటాస్ విమాన సిబ్బంది!
- విమానంలో స్నేహితులతో గొడవ
- అనుచితంగా ప్రవర్తించిన స్లాటర్
- బలవంతంగా దించేసిన సెక్యూరిటీ సిబ్బంది
తన అనుచిత ప్రవర్తనతో ఆస్ట్రేలియాకు చెందిన మాజీ ఓపెనర్ మైఖేల్ స్లాటర్ విమానం నుంచి గెంటివేతకు గురయ్యాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే, క్వాంటాస్ విమానంలో సిడ్నీ నుంచి తన హోమ్ టౌన్ అయిన వాగా వాగాకు బయలుదేరిన వేళ, తన ఇద్దరు స్నేహితులతో వాదనకు దిగిన స్లాటర్, పెద్దగా అరుస్తూ, కేకలు పెడుతూ బీభత్సం సృష్టించాడు. ఆపై టాయిలెట్ లోపలికి వెళ్లి, గడియ పెట్టుకుని, బయటకు వచ్చేందుకు నిరాకరించాడు.
ఈ ఘటనతో విమానం 30 నిమిషాలు ఆలస్యం కాగా, సెక్యూరిటీ సిబ్బందిని పిలిపించిన విమాన పైలట్, అతన్ని బలవంతంగా విమానం దింపేశారు. మరో వారం తరువాత ఇంగ్లండ్ లో ప్రారంభం కానున్న వరల్డ్ కప్ క్రికెట్ లో కామెంటేటర్ గా విధులు నిర్వహించాల్సి వున్న స్లాటర్, ఇలా వివాదంలో చిక్కుకోవడం గమనార్హం. ఇక జరిగిన ఘటనపై స్పందించిన స్లాటర్, తాను ఇందుకు క్షమాపణలు చెబుతున్నానని, తన ప్రవర్తనతో ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగిందని అంగీకరించాడు. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో 1993 నుంచి 2001 వరకూ ఆడిన స్లాటర్ 2004లో రిటైర్ మెంట్ తీసుకుని, ఆపై కామెంటేటర్ గా రాణిస్తున్నాడు.