tv9 ceo: టీవీ9 లోగోను సృష్టించింది నేనే.. దానికి రాయల్టీ ఎగ్గొట్టాలన్న ఉద్దేశంతోనే నాపై తప్పుడు కేసులు!: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్
- నేనేదో తీవ్రవాది అయినట్లు పోలీసులు ప్రవర్తించారు
- ఎయిర్ పోర్టులు, షిప్ యార్డుల్లో అలర్ట్ లు ప్రకటించారు
- నాపై అన్యాయంగా మూడు దొంగ కేసులు పెట్టారు
- వీడియో విడుదల చేసిన టీవీ9 మాజీ సీఈవో
‘నువ్వు టీవీ9ను మొదలుపెట్టి విస్తరించి ఉండొచ్చు. కానీ నా పరిమితులకు లోబడి పనిచేయకపోతే బాగుండదు’ అని మైహోమ్ రామేశ్వరరావు తనను హెచ్చరించారని టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ తెలిపారు. టీవీ9 సీఈవోగా తొలగింపు, ఫోర్జరీ కేసుల నేపథ్యంలో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఆయన తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు. తనపై మూడు దొంగ కేసులు పెట్టారని రవిప్రకాశ్ ఆవేదన వ్యక్తం చేశారు.
‘ఏదో తీవ్రవాది పారిపోతున్నాడన్నట్లుగా ఎయిర్ పోర్టుల్లో అలర్టులు,షిప్ యార్డుల్లో అలర్ట్ లు పెట్టాం అని పోలీసులు చెబుతున్నారు. రామేశ్వరరావు ఒత్తిడితో పనిచేసే, అనుకూలంగా ఉండే పత్రికలు, మీడియా సంస్థలు రవిప్రకాశ్ అనే తీవ్రవాది తప్పించుకుని పారిపోతున్నాడు అన్నట్లు వార్తలు రాస్తున్నాయి. వారికి అంత వినోదం కలిగినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను’ అని చురకలు అంటించారు. తనకు, శివాజీకి మధ్య జరిగిన ఒప్పంద పత్రాలు ఎన్ సీఎల్టీలో ఉన్నాయనీ, కోర్టు అనుమతి లేకుండా ఆ పత్రాలను సంపాదించిన పోలీసులు కేసు నమోదు చేశారని రవిప్రకాశ్ తెలిపారు.
‘ఇది పోలీసుల అజ్ఞానం అయినా కావాలి. లేదంటే మేం చట్టం పట్టించుకోకుండా ముందుకెళతాం. మమ్మల్ని ఎవరు ఆపుతారు? అనే ఉద్దేశం అయినా కావాలి. నేను టీవీ9 సీఈవోగా ఉండగా దేవేందర్ అగర్వాల్ అనే పార్ట్ టైమ్ ఉద్యోగి సంతకాన్ని ఫోర్జరీ చేసి అతను రాజీనామా చేసినట్లు లేఖ సృష్టించినట్లు నాపై తప్పుడు కేసు పెట్టారు. వాస్తవం ఏంటంటే అగర్వాల్ ను రామేశ్వరరావు మనుషులు కిడ్నాప్ చేశారు. రాత్రంతా బందీగా ఉంచుకుని తమ డైరెక్టర్ల పేర్లను అప్ లోడ్ చేయించే ప్రయత్నం చేశారు. కానీ అగర్వాల్ ముందుగానే రాజీనామా చేయడంతో అది కుదరలేదు.
వాళ్లు చట్ట ఉల్లంఘనకు పాల్పడి నాపై తప్పుడు క్రిమినల్ కేసు పెట్టారు. నేను రామేశ్వరరావు, మేఘా కృష్ణారెడ్డిల సంతకాన్ని ఫోర్జరీ చేసుంటే ఆస్తులను కాజేస్తున్నానని అర్థం చేసుకోవచ్చు. టీవీ9 లోగోను దొంగిలించుకుని పారిపోయానని నాపై మరో కేసు పెట్టారు. టీవీ9 లోగో యజమాని రవిప్రకాశ్. టీవీ9ను సృష్టించింది రవిప్రకాశ్. ఈ లోగోను వాడుకోవాలంటే నాకు రాయల్టీని చెల్లించాల్సి ఉంటుంది.
ఇది చెల్లించాలి కాబట్టి నేను లోగోను దొంగలించానని తప్పుడు కేసు పెట్టారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో హైదరాబాద్ పోలీసులు మైహోం రామేశ్వరరావు ఆదేశాల మేరకు తు.చ. తప్పకుండా పనిచేస్తున్నారు’ అని విమర్శించారు. భవిష్యత్ తరాలు మనల్ని ఆదర్శంగా తీసుకోవాలంటే కొన్ని విలువల కోసం నిలబడాలని రవిప్రకాశ్ వ్యాఖ్యానించారు.
దొంగ కేసులు, పోలీసుల వేధింపులు ఉంటాయనీ, వాటిని తట్టుకుని నిలబడాలని అభిప్రాయపడ్డారు. ఈరోజు తాను ఈ దొంగ దాడులకు భయపడకుండా ఓ అడుగు ముందుకు వేస్తున్నాననీ, తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా మిత్రులందరిని కోరుతున్నానని రవిప్రకాశ్ అన్నారు.