Jana Sena: అనుభవంతో చెబుతున్నా... ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడూ నిజం కావు: మాదాసు గంగాధరం
- తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ ఏమయ్యాయో అందరికీ తెలుసు
- జనసైనికులు నిరాశ చెందనవసరంలేదు
- కౌంటింగ్ రోజున కార్యకర్తలెవరూ విజయవాడ రావొద్దు
ఎన్నికల సందర్భంగా విడుదలయ్యే ఎగ్జిట్ పోల్స్ ను పెద్దగా పట్టించుకోనవసరంలేదని జనసేన ముఖ్యనేత మాదాసు గంగాధరం అన్నారు. ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ, సుదీర్ఘ రాజకీయ అనుభవంతో చెబుతున్నాను, ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడూ నిజంకావు అని స్పష్టం చేశారు. నిన్నగాక మొన్న తెలంగాణ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ విషయంలో ఏంజరిగిందో అందరికీ తెలుసని, అందువల్ల జనసైనికులు డీలాపడిపోవాల్సిన పనిలేదని మాదాసు వ్యాఖ్యానించారు.
ఎగ్జిట్ పోల్స్ అనేవి ఓ వ్యాపారంలా మారిపోయాయని, చాలామంది బెట్టింగులతో సంసారాలు కూడా నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ విషయంలో కూడా జనసేనపై కుట్ర జరిగిందని, అంతమాత్రాన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే నిజమని భావించి జనసేన కార్యకర్తలు నిరాశకు గురికావద్దని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో జనసేనకు సైలెంట్ ఓటింగ్ జరిగిందని, యువత, మహిళలు, బీసీలు, మైనారిటీలు జనసేన పక్షాన నిలిచారని మాదాసు చెప్పారు.
కౌంటింగ్ వేళ జనసేన ఏజెంట్లు ఎంతో క్రమశిక్షణతో మెలగాలని కూడా ఆయన ఈ సందర్భంగా సూచించారు. లెక్కింపులో ఏవైనా తేడాలు ఉన్నట్టు గమనిస్తే తమలో తాము మాట్లాడుకోకుండా రిటర్నింగ్ అధికారికి లిఖితపూర్వకంగా వెంటనే తెలియజేసి వ్యవస్థకు సహకరించాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా, కౌంటింగ్ సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను కలిసేందుకు ఎవరూ విజయవాడ రావొద్దని, ఫలితాల తర్వాత జనసేన అధ్యక్షుడే అందరినీ కలుస్తారని మాదాసు వివరించారు.