Andhra Pradesh: మంగళగిరిలో మరోసారి వైసీపీ జెండా ఎగరబోతోంది: ఎమ్మెల్యే ఆర్కే
- మంగళగిరిలో హోరాహోరి పోరు ఏమీ లేదు
- ఎన్నిక వన్ సైడ్ గానే ఉంది
- లోకేశ్ తన గెలుపు కోసం వందల కోట్లు ఖర్చు పెట్టారు
ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. ఏపీలోని కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ, వైసీపీ పోటాపోటీగా ఉన్నాయి. అటువంటి వాటిలో గుంటూరు జిల్లా లోని మంగళగిరి నియోజకవర్గం ఒకటి. ఇక్కడి నుంచి టీడీపీ తరపున నారా లోకేశ్, వైసీపీ తరపున ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) పోటీ చేశారు. లోకేశ్, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కేల మధ్య పోటీ రసవత్తరంగా జరిగింది. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గం నుంచి గెలుపు ఎవరిదన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ సందర్భంగా పలకరించిన మీడియాతో ఆర్కే మాట్లాడుతూ, మంగళగిరిలో హోరాహోరి పోరు ఏమీ లేదని, ఎన్నిక వన్ సైడ్ గానే ఉందని, ఈ నియోజకవర్గంలో మరోసారి వైసీపీ జెండా ఎగరబోతోందని ధీమా వ్యక్తం చేశారు. లోకేశ్ తన గెలుపు కోసం సుమారు రూ.150 నుంచి రూ.200 కోట్ల వరకు ఖర్చు పెట్టారని ప్రజలు చెబుతున్నారని, ఎన్నికల ప్రచారం సమయంలో తాను ఇంటింటికీ తిరిగినప్పుడు.. టీడీపీపై వాళ్లు తమకు పదివేలు ఇచ్చారు, పదిహేను వేలు ఇచ్చారని, కొన్ని ఇళ్లల్లో ఏసీలు, ఫ్రిజ్ లు, టీవీలు ఇచ్చారని ప్రజలు చెప్పారని ఆరోపించారు.