Andhra Pradesh: మళ్లీ చెబుతున్నా.. బెట్టింగ్ లకు పాల్పడొద్దు: లగడపాటి రాజగోపాల్
- టీడీపీకి 6 శాతం మహిళలు అధికంగా ఓట్లేశారు
- ఈ విషయమై మాకు స్పష్టమైన అంచనా ఉంది
- ఏపీలో కచ్చితంగా టీడీపీ ప్రభుత్వం వస్తుంది
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై లగడపాటి రాజగోపాల్ సర్వేపై విపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. గతంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై లగడపాటి సర్వేను ఆధారంగా చేసుకుని బెట్టింగ్ లకు పాల్పడ్డ వారు వందల కోట్ల రూపాయలు నష్టపోయారన్న ఆరోపణలు లేకపోలేదు. ఏపీకి సంబంధించిన లగడపాటి సర్వేలో టీడీపీకే మళ్లీ ప్రజలు పట్టం కడతారని చెప్పారు. దీన్ని ఆధారంగా చేసుకుని బెట్టింగ్ లకు పాల్పడుతున్నారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో లగడపాటి స్పందించారు.
మళ్లీ చెబుతున్నానని, తన సర్వేలపై ఆధారపడి బెట్టింగ్ లకు పాల్పడొద్దు అని సూచించారు. అయితే, తనకు స్పష్టమైన అంచనా అందింది కనుకనే ఈ సర్వే ఫలితాలను స్పష్టంగా ఇటీవల వెల్లడించానని అన్నారు. టీడీపీకి ఆరు శాతం మహిళలు అధికంగా ఓట్లు వేశారని, ఈ విషయమై తమకు స్పష్టమైన అంచనాలు ఉన్నాయని అన్నారు. ఏపీలో కచ్చితంగా టీడీపీ ప్రభుత్వం వస్తుందని, వందకు పైగా సీట్లు వస్తాయని మరోసారి లగడపాటి అభిప్రాయపడ్డారు.