Election: లెక్కింపులో అభ్యంతరాలుంటే ఫిర్యాదుకు రెండు నిమిషాల సమయం!
- కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- కేంద్రాల్లోకి సెల్ఫోన్లకు అనుమతి నిల్
- లెక్కింపుపై అభ్యంతరాలు ఉంటే నియోజకవర్గ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయాలన్న ఎన్నికల సంఘం
దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. లెక్కింపు కేంద్రాల్లోకి సెల్ఫోన్లు అనుమతించబోమని ఇప్పటికే స్పష్టం చేసింది. లోపలికి వెళ్లేముందు ఏజెంట్లు తమ మొబైల్ ఫోన్లను పోలీసుల వద్ద జమచేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఫొటో, వీడియో జర్నలిస్టులను గ్రూపులవారీగా ఆయా కేంద్రాల్లోకి అనుమతించనున్నట్టు తెలిపారు.
కాగా, ఓట్ల లెక్కింపు తర్వాత తుది ఫలితం వెల్లడికి మధ్య రెండు నిమిషాల సమయం ఉంటుంది. ఓట్ల లెక్కింపుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆ లోపు నియోజకవర్గ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. తమ కార్యాలయానికో, కేంద్ర ఎన్నికల సంఘానికో ఫిర్యాదు చేస్తే ప్రయోజనం ఉండదని, నియోజకవర్గ ఎన్నికల అధికారి లెక్కింపు కేంద్రంలోనే అందుబాటులో ఉంటారని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.