Rahul Gandhi: తప్పు ఎక్కడ జరిగిందో చర్చించడానికి ఇది సమయం కాదనుకుంటున్నా: రాహుల్ గాంధీ
- ప్రజలు తమ నాయకుడిగా మోదీనే ఎన్నుకున్నారు
- ఓ భారతీయుడిగా తప్పక గౌరవిస్తాను
- ప్రజల మనసులో ఏముందో తెలుసుకోలేకపోయాను
సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాలు దిగ్భ్రాంతి కలిగించేలా వస్తుండడం పట్ల కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. ఇవాళ సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీయే తమ ప్రధాని అని దేశప్రజలు స్పష్టంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో, తప్పు ఎక్కడ జరిగిందో చర్చించడానికి ఇది తగిన సమయం కాదనుకుంటున్నానని పేర్కొన్నారు. ఓ భారతీయుడిగా తోటి ప్రజల అభిప్రాయాన్ని తప్పక గౌరవిస్తానని అన్నారు.
అంతేగాకుండా, తనపై అమేథీలో స్మృతీ ఇరాని గెలిచినందుకు ఆమెకు అభినందనలు తెలియజేశారు. ప్రజల మనసులో ఏముందో తెలుసుకోలేకపోయానని చెప్పడం ద్వారా రాహుల్ పరోక్షంగా ఓటమిని అంగీకరించారు. విస్పష్ట విజయాన్ని సాధించిన ప్రధాని మోదీ, బీజేపీలను ఈ సందర్భంగా అభినందిస్తున్నట్టు రాహుల్ తెలిపారు.