Narendra Modi: తన పేరు నుంచి ‘చౌకీదార్’ పదాన్ని తొలగించిన మోదీ
- చౌకీదార్‌ను మరోస్థాయికి తీసుకెళ్లే సమయం ఆసన్నమైందన్న మోదీ
- తన పేరు ముందు ఉన్న ఆ పదాన్ని తొలగించాలని నేతలకు పిలుపు
- దుష్టశక్తుల నుంచి దేశాన్ని చౌకీదార్ కాపాడిందని కితాబు
ఈ ఎన్నికల్లో ‘చౌకీదార్’ నినాదంతో ముందుకొచ్చిన ప్రధాని నరేంద్రమోదీ ఇప్పుడా పదాన్ని తొలగించారు. ట్విట్టర్లో తన పేరుకు ముందు ఇన్నాళ్లు కనిపించిన ‘చౌకీదార్’ పదం బీజేపీ విజయం సాధించిన వెంటనే మాయమైంది. ఎన్నికల ప్రచారంలో మోదీ తన ప్రతీ ప్రసంగంలోనూ చౌకీదార్ నినాదాన్ని వినిపించారు. అంతేకాదు, ఆ పార్టీ మంత్రులు, నేతలు, మద్దతుదారులు, అభిమానులు కూడా తమ పేర్ల ముందు చౌకీదార్ పదాన్ని చేర్చుకున్నారు.
తాజా ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో మోదీ తన ట్విట్టర్ ఖాతా ముందు ఉన్న చౌకీదార్ పదాన్ని తొలగించారు. ఈ సందర్భంగా .. దేశ ప్రజలు చౌకీదార్లుగా మారి దేశానికి ఎంతో సేవ చేశారని, చౌకీదార్ దేశంలో అతి పెద్ద శక్తిగా అవతరించిందని అన్నారు. దేశాన్ని కులమత కలహాలు, అవినీతి నుంచి కాపాడిందని, దుష్టశక్తులను పారదోలిందని ట్వీట్ చేశారు. చౌకీదార్ పదం శాశ్వతంగా తన మదిలో నిలిచిపోతుందన్నారు.
చౌకీదార్‌ను ఇప్పుడు మరో స్థాయికి తీసుకెళ్లాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్న మోదీ.. దేశంలో ఈ స్ఫూర్తిని ప్రతీక్షణం సజీవంగా ఉంచుదామని పేర్కొన్నారు. అందుకనే తన ట్విట్టర్ ఖాతా నుంచి ఆ పదాన్ని తొలగిస్తున్నానని, అయినప్పటికీ అది తన మనసులో ఎప్పటికీ ఉంటుందని వివరించారు. ఇప్పటి వరకు ఆ పదాన్ని పెట్టుకున్న అందరూ దానిని తొలగించాలని మోదీ కోరారు.