YSRCP: మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ అసెంబ్లీకి...సంచలన విజయం సాధించిన అంబటి
- 1989లో తొలిసారి గెలుపు
- గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యేగా ప్రస్థానం
- ఆ తర్వాత మళ్లీ రాని అవకాశం
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, సీనియర్ నేత అంబటి రాంబాబు ఓ అరుదైన ఘనత దక్కించుకున్నారు. ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం ఎమ్మెల్యేగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తొలిసారి అడుగుపెట్టిన ఆయన మళ్లీ ఇన్నేళ్ల తర్వాత నవ్యాంధ్ర అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి రాజకీయ ఉద్ధండుడు, స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై తాజా ఎన్నికల్లో అంబటి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
పార్టీ అధికార ప్రతినిధిగా, మంచి వాగ్ధాటి ఉన్న వ్యక్తిగా రాంబాబుకు పేరుంది. 1989లో రేపల్లె నియోజకవర్గం నుంచి ఆయన తొలిసారి గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 1994, 1999లో రేపల్లె నుంచే మళ్లీ పోటీ చేసిన ఆయన విజయం సాధించలేకపోయారు. గత ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీచేసి కోడెల చేతిలో ఓటమిపాలయ్యారు. ఈ ఎన్నికల్లో మళ్లీ ఆయనపైనే పోటీ చేసి విజయం సాధించడం ద్వారా సత్తా చాటారు.