Andhra Pradesh: జగన్ ను చాలా ఘోరంగా ఏడిపించారు.. అయినా నవ్వుతూ కోర్టు మెట్లు ఎక్కాడు!: పోసాని కృష్ణమురళి
- చంద్రబాబు ఎప్పుడూ లూజ్ టంగ్ తో మాట్లాడలేదు
- కానీ 2014 తర్వాత ఈ పరిస్థితి మారిపోయింది
- కేంద్రంతో పెట్టుకుంటే జగన్ కు చాలా కష్టం
ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు గతంలో ఎప్పుడూ లూజ్ టంగ్ తో మాట్లాడలేదని ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి తెలిపారు. ఎప్పుడు మీడియా సమావేశంలో పాల్గొన్నా, ఆచితూచి మాట్లాడేవారని వ్యాఖ్యానించారు. అయితే, ఆయన వయసు పెరిగిందో, టెన్షన్ పెరిగిందో తెలియదు కానీ, చంద్రబాబు ఈసారి మాట్లాడినన్ని తప్పులు ఎప్పుడూ మాట్లాడలేదని అన్నారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోసాని మాట్లాడారు.
ముఖ్యంగా ‘దళితులుగా ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా?’ అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రజల్లోకి బాగా పోయిందని వ్యాఖ్యానించారు. ఇలాంటి మాటలను 2014 తర్వాతే చంద్రబాబు మాట్లాడారని చెప్పారు. జగన్ కేంద్రాన్ని గౌరవించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధులు వేల కోట్ల రూపాయలు ఉంటాయనీ, వారితో పెట్టుకుంటే తీవ్రంగా నష్టపోతామని హెచ్చరించారు. ‘జగన్ ను పాదయాత్రలో కత్తితో పొడిచారు. అయినా కట్టు కట్టుకుని మళ్లీ పాదయాత్రకు వచ్చాడు.
ఆయన్ను ఎంత ఘోరంగా ఏడిపించారంటే ..3,000 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ ప్రతీ శుక్రవారం కోర్టుకు రావాలి. దేశంలో ఓ యువకుడిని ఎవరైనా ఇంతలా ఏడిపించారా? ఒక్క చంద్రబాబు తప్ప. ఇంత జరిగినా ఏ ఒక్కరోజూ ఎగ్గొట్టకుండా జగన్ కోర్టు మెట్లు ఎక్కాడు. కత్తితో పొడిస్తే రక్తం తుడుచుకుని చొక్కా మార్చుకుని హైదరాబాద్ కు వచ్చాడు.
చంద్రబాబు చెప్పినట్లు నేరుగా ఇంటికి పోలేదు. ఆసుపత్రిలో చేరాడు. మళ్లీ ప్రజల్లోకి వచ్చాడు. ఈ వయసులోనే జగన్ ప్రజల మనసును, రాజకీయాలను తెలుసుకున్నాడు. నాయకుడు అనేవాడు కులం నుంచి పుట్టడు. అలాగే జగన్ జనం నుంచి వచ్చాడు. అందుకే అతను కలకాలం ఉంటాడు’ అని వ్యాఖ్యానించారు.