Andhra Pradesh: తొడ గొట్టింది అందుకే.. ఎవర్నీ ఇబ్బంది పెట్టాలని కాదు!: బుద్ధా వెంకన్న
- 50-60 సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉంది
- చంద్రబాబు మంచితనంతో వీరిని తప్పించలేకపోయారు
- కార్యకర్తల్లో ధైర్యం నింపడానికే తొడ గొట్టాను
ఆంధ్రప్రదేశ్ ఓటర్లు మార్పును ఆశించి వైసీపీకి ఓటు వేశారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తెలిపారు. ప్రజాతీర్పును గౌరవిస్తున్నామనీ, ఓటమిని అంగీకరిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఏపీలో ఈసారి పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని అంగీకరించారు. ఒకవేళ వారిని మార్చి ఉంటే కచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఉండేవాళ్లమని చెప్పారు. ఇటీవల పార్టీ గెలుస్తుందని తొడ కొట్టడంపై వెంకన్న స్పందించారు.
ఏపీలో కేవలం 23 స్థానాలకు టీడీపీ పరిమితం కావడం నిజంగా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు దేవుడిలాంటి మనిషి అనీ, రోజుకు 18 గంటలు పనిచేసి సంక్షేమ ఫలాలు అందించారని తెలిపారు. అలాంటి వ్యక్తికి ప్రజలు కేవలం 23 స్థానాలు ఇవ్వడం సరికాదని అభిప్రాయపడ్డారు. ‘జగన్, చంద్రబాబుకు ఓ తేడా ఉంది. ఇతను గెలవడు అని అనిపిస్తే జగన్ సదరు నేతలను తీసిపడేశారు. కానీ టీడీపీలో చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉంది.
కానీ చంద్రబాబు మంచితనం కారణంగా వారందరిని కొనసాగించారు. చంద్రబాబు జనం అనుకున్నంత కఠినమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి కాదు. వాస్తవానికి 50-60 మంది సిట్టింగ్ లను మార్చాలని అనుకున్నా, మొహమాటం కారణంగా ఆయన తప్పించలేకపోయారు. ఈ ఒక్క కారణంగానే టీడీపీ ఓడిపోయింది’ అని చెప్పారు.
టీడీపీ గెలుస్తుందని తొడ కొట్టిన విషయమై బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. ‘చంద్రబాబు అమలుచేసిన సంక్షేమ పథకాలు టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తాయని నేను నమ్మాను. ఆ ధీమాతోనే, మా పార్టీ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపాలన్న ఉద్దేశంతోనే తొడగొట్టాను. అంతేతప్ప ఎవరినీ ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం నాకు లేదు’ అని స్పష్టం చేశారు.