Andhra Pradesh: ఈ నెల 30న ప్రమాణస్వీకారం చేసేది జగన్ ఒక్కరే.. రేపు గవర్నర్ ను కలుసుకుంటాం!: వైసీపీ నేత సజ్జల
- సిద్ధార్థ కాలేజీ ఎదురుగా ప్రమాణస్వీకార వేదిక?
- కనీసం 20 ఎకరాలు ఎంపిక చేయాలని జగన్ ఆదేశం
- సభకు కనీసం 5-7 లక్షల మంది హాజరయ్యే ఛాన్స్
నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారానికి రంగం సిద్ధమయింది. ఈ నెల 30న జగన్ ఒక్కరే ప్రమాణస్వీకారం చేస్తారని ఆ పార్టీ సీనియర్ నేత, జగన్ రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. రేపు వైసీపీ శాసనసభా పక్షం సమావేశమై జగన్ ను తమ నేతగా ఎన్నుకుంటారనీ, అనంతరం తామంతా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను కలుస్తామని చెప్పారు. ఈరోజు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
కాగా, జగన్ ప్రమాణస్వీకార వేదికపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. తొలుత విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేయాలని జగన్ భావించారు. అయితే ట్రాఫిక్ సమస్య తీవ్రం అవుతుందని అధికారులు సూచించడంతో ఆ ఆలోచనను విరమించుకున్నారు. ప్రస్తుతం విజయవాడలోని చినఅవుటపల్లిలో సిద్ధార్థ మెడికల్ కాలేజీకి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలిస్తున్నట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి.
ప్రమాణస్వీకార కార్యక్రమానికి కనీసం 5 నుంచి 7 లక్షల మంది హాజరు అవుతారని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కనీసం 20 ఎకరాల ఖాళీ స్థలాన్ని ఎంపిక చేయాలని జగన్ వైసీపీ నేతలను ఆదేశించినట్లు సమాచారం.