Gujarath: సూరత్ లోని కోచింగ్ సెంటర్ లో ఘోర అగ్నిప్రమాదం.. 15 మంది మృతి!
- సర్తానా ప్రాంతంలోని ఓ బిల్డింగ్ లో ప్రమాదం
- రెండో అంతస్తులో చెలరేగిన మంటలు
- పలువురికి తీవ్ర గాయాలు
గుజరాత్ లోని సూరత్ లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. సర్తానా ప్రాంతంలో ఉన్న ఓ బిల్డింగ్ లోని రెండో అంతస్తులో కోచింగ్ సెంటర్ ఉంది. ఈ కోచింగ్ సెంటర్ లో మంటలు చెలరేగడంతో ఈ దుర్ఘటన జరిగినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందగా, చాలా మందికి గాయాలయ్యాయి. తమ ప్రాణాలు కాపాడుకునేందుకు పలువురు బాధితులు ఆ బిల్డింగ్ పై నుంచి కిందకు దూకడంతో తీవ్ర గాయాల పాలయ్యారు.
మంటలను అదుపు చేసేందుకు 18 అగ్నిమాపక శకటాలు రంగంలోకి దిగాయి. ఈ ఘటనపై సూరత్ పోలీస్ కమిషనర్ స్పందిస్తూ, ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందారని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలిపారు. కోచింగ్ సెంటర్ లో మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అన్నారు. కాగా, సహాయకచర్యలు ముమ్మరం చేయాలని ఈ మేరకు ప్రధాని మోదీ ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
ఈ ఘటనపై విచారణకు ఆదేశం
ఈ ప్రమాద ఘటనపై సీఎం విజయ్ రూపానీ విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం.